
ప్రస్తుత రోజుల్లో అధిక మానసిక ఒత్తిడి, తినే ఆహారం సరైన విధంగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రతి రోజు కొద్దిగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు అలాంటి ముఖ్యమైన 7 డ్రై ఫ్రూట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
వాల్‌నట్స్ మన గుండెకు కావలసిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా కలిగి ఉంటాయి. ఇవి గుండెకు మంచిగా పనిచేస్తూ శరీరంలో వాపులను తగ్గిస్తాయి. వాల్‌నట్ తినడం వల్ల రక్త నాళాల ఆరోగ్యం మెరుగవుతుంది.. ఇది గుండె సంబంధిత సమస్యలు రావడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నందున ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి హృదయానికి రక్షణ కల్పిస్తాయి.
బాదాంలో విటమిన్-ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి రోజు 5-6 బాదాం పప్పులు తినడం వల్ల గుండె పని తీరు మెరుగవుతుంది. అంతేగాక ఇవి గ్లూకోజ్ స్థాయిలను కూడా నియంత్రించగలవు.
చిన్నదిగా కనిపించే ఎండు ద్రాక్షలు పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండెకు మంచివిగా పనిచేస్తాయి. పొటాషియం కూడా పుష్కలంగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఇవి సహాయపడతాయి. అలాగే ఇవి గుండెపై ఒత్తిడిని తగ్గించే గుణం కలిగి ఉన్నాయి.
ఆప్రికాట్‌లలో ఫైబర్, విటమిన్-ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె నాళాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండెకు రక్తప్రవాహం సజావుగా జరుగుతుంది. ఆహారంలో ఆప్రికాట్‌ను చేర్చడం గుండె ఆరోగ్యానికి మంచిది.. ఇతర శారీరక వ్యవస్థలకు కూడా మేలు చేస్తుంది.
డేట్స్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది.. ఇది రక్తపోటును సమతుల్యంలో ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఇవి ప్రాకృతిక చక్కెరలను కలిగి ఉండటంతో శక్తిని ఇస్తాయి. గుండెపోటు, రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గించే గుణాలు డేట్స్‌లో ఉంటాయి. రోజు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తీసుకుంటే చాలు.
పిస్తా పప్పులు ఒమేగా-3 ఫ్యాట్స్‌తో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి గుండెకు మద్దతు ఇస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకు అరగంట నానబెట్టిన 5-6 పిస్తా తినడం మంచిది.
జీడిపప్పులో మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు ఉండటంతో ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఇవి శరీరంలో రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి, హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే వీటిలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో తగిన పరిమితిలో మాత్రమే తీసుకోవడం మంచిది. ఇవన్నీ సహజంగా లభించే ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్. వీటిని ప్రతి రోజు కొద్దిగా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)