
గౌట్ వచ్చినప్పుడు యూరిక్ యాసిడ్ గురించి ఎక్కువగా వింటాం. కానీ ఇది శరీరంలోని చిన్న చిన్న రక్తనాళాలకు లోపల నష్టం కలిగిస్తూ ఉండొచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే రక్తనాళాల లోపలి పొర బలహీనపడుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో వాపు పెంచి గుండెపోటు వంటి వాటికి దారి తీస్తుంది.
గుండెపోటు అంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్లే వస్తుందని సాధారణంగా అనుకుంటాం. కానీ కొత్త వివరాల ప్రకారం.. కొలెస్ట్రాల్ సరిగ్గా ఉన్నా.. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఇది చిన్న రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించి, ఆక్సిజన్ సరఫరా తగ్గించి, గుండెను బలహీనపరుస్తుంది.
మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అధిక రక్తపోటు, పొట్ట చుట్టూ కొవ్వు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులు వంటి సమస్యలన్నీ కలిసి ఉండటం. గతంలో యూరిక్ యాసిడ్ ఈ సమస్యల వల్ల వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు యూరిక్ యాసిడే ఈ సమస్యలకు కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. శరీర జీవక్రియలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఇన్సులిన్ పనితీరు తగ్గుతుంది. ఇది మెటబాలిక్ సమస్యలకు దారి తీస్తుంది.
ల్యాబ్ రిపోర్టుల్లో యూరిక్ యాసిడ్ 7.0 mg/dL వరకు సాధారణం అని చూపిస్తారు. కానీ కొంతమంది గుండె డాక్టర్లు ఏమంటున్నారంటే.. గుండె ఆరోగ్యానికి అది 5.5 mg/dL కన్నా తక్కువగా ఉండటం మంచిది అని. అంటే మీ రిపోర్ట్ లో నార్మల్ అని ఉన్నా.. మీకు గుండె జబ్బులు లేదా మెటబాలిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే.. ఆ యూరిక్ యాసిడ్ స్థాయి మీకు ఎక్కువగానే ఉండొచ్చు.
యూరిక్ యాసిడ్ ను కేవలం ఒక అంకెగా చూడకుండా.. శరీరంలోని జీవక్రియల ఒత్తిడికి ఒక సంకేతంగా అర్థం చేసుకోవడం తెలివైన పని. ప్రతి చిన్న అంకె చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ అంకె వెనుక ఉన్న ప్రభావాలను అర్థం చేసుకోవడమే ముఖ్యం. లక్షణాలను అస్సలు వదిలేయకండి. పరిస్థితి మరీ తీవ్రమయ్యే వరకు ఆగకండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)