
బ్రెజిల్‌లో 12,772 మందిపై దాదాపు ఎనిమిదేళ్ల పాటు జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృత్రిమ తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారిలో జ్ఞాపకశక్తి ఇతరులకంటే 62 శాతం వేగంగా క్షీణిస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల మెదడు తన అసలు వయస్సు కంటే 1.6 ఏళ్లు ముందే ముసలిదైపోతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అస్పర్టమే, సాకరిన్ వంటి పదార్థాలు రక్తంలో చక్కెరను పెంచకపోయినా, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో, మనం వాడే ఉత్పత్తుల వెనుక ఉన్న అసలు రహస్యాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
కృత్రిమ తీపి పదార్థాలు అంటే ఏమిటి?
ఇవి ఫ్యాక్టరీల్లో తయారయ్యే రసాయన పదార్థాలు. ఇవి చక్కెర కంటే వందల రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి, కానీ వీటిలో క్యాలరీలు ఉండవు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని ఎంచుకుంటారు. అయితే ఇవి సహజమైనవి కాకపోవడం వల్ల శరీర జీవక్రియలపై, ముఖ్యంగా పేగు ఆరోగ్యం మెదడు సంకేతాల పై ప్రభావం చూపుతాయి.
ఏయే పదార్థాల్లో ఇవి ఉంటాయి?
మార్కెట్లో ‘షుగర్-ఫ్రీ’, ‘నో యాడెడ్ షుగర్’ లేదా ‘డైట్’ అనే లేబుల్ ఉన్న ఉత్పత్తుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. మీరు కొనే ముందు కింది పేర్లను ఒకసారి చెక్ చేయండి:
అస్పర్టమే (Aspartame)
సుక్రలోజ్ (Sucralose)
సాకరిన్ (Saccharin)
జైలిటాల్ (Xylitol)
ఎరిత్రిటాల్ (Erythritol)
ఇతర ఆరోగ్య సమస్యలు:
మెదడు పనితీరు మందగించడమే కాకుండా, వీటి వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి ఆకలిని నియంత్రించే మెదడు కేంద్రాలను తప్పుదోవ పట్టించి, చివరికి అధిక బరువుకు దారితీయవచ్చు.
సురక్షితమైన ప్రత్యామ్నాయాలు:
చక్కెరకు బదులుగా తక్కువ మొత్తంలో కింది సహజ పదార్థాలను ఎంచుకోవడం ఉత్తమం:
తేనె ఖర్జూరం: వీటిలో సహజ చక్కెరతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
స్టీవియా : ఇది మొక్కల నుండి లభించే తీపి పదార్థం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ సున్నా.
పండ్లు: పండ్లలో ఉండే ఫైబర్ వల్ల చక్కెర రక్తంలోకి నెమ్మదిగా చేరుతుంది.
మెదడు ఆరోగ్యం కోసం చిట్కాలు:
రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర అవసరం.
కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయండి.
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్ టైమ్ తగ్గించండి.
ఆల్కహాల్ ధూమపానానికి దూరంగా ఉండండి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆహారంలో మార్పులు చేసే ముందు నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి.