
ఇటీవల 2025-26 కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌లో మఖానా బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఈ సాధారణ మఖానా గింజలకు మరింత ప్రజాదరణ కలగనుంది. దీనిని ఫాక్స్ సీడ్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ తామర గింజల్లో అధిక మొత్తంలో ప్రొటీన్, విటమిన్లు ఉండటం వల్ల వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. వీరిని తరచుగా ఆహారంగా తీసుకుంటే సులువుగా బరువు తగ్గడంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది..
అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాల కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మఖాన అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. బరువు తగ్గడానికి ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే కెలోరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే మఖాన తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫిట్ నెస్ ప్రపంచంలో వీటికి మంచి ఆదరణ ఉన్నప్పటికీ అధిక మొత్తంలో పూల్ మఖానా తీసుకుంటే లేని రోగాలను కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు వైద్యులు.
మఖానా ఎంతో తేలికగానే జీర్ణమయ్యే స్నాక్. అయినప్పటికీ వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అది మలబద్ధకానికి దారితీస్తుంది. ఇక వేసవిలో మామూలుగానే ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. కడుపు ఉబ్బరం, విరేచనాలను కూడా కలుగజేస్తుంది. కాబట్టి మోతాదు మించకుండా వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.
మఖానాలో కాల్షియం అధికమొత్తంలో లభిస్తుంది. వాటిని కాల్షియం లేమితో బాధపడేవారు కచ్చితంగా తీసుకోవాలి. అయితే, మోతాదు మించి తీసుకుంటే మాత్రం ఇందులోని కాల్షియం నిల్వలు శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. దీని వల్ల శరీరంలోని పలు ప్రాంతాల్లోల కాల్సిఫికేషన్ ఏర్పడుతుంది. ఇదంత మంచిది కాదు.
మఖానా వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి కొంత రిస్క్ అనే చెప్పాలి. దీనిని సరైన విధంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మితిమీరి తిన్నప్పుడు ఇది గుండెజబ్బుల రిస్క్ ఉన్న వారికి ఆ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు ఉన్నవారు కూడా వీటిని ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి.
మఖానాను అతిగా తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు రావచ్చు. ఇది ఇతరత్రా చర్మ సమస్యలు కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లకు కూడా మఖానా కారణమవుతుంది. కాబట్టి ఎంత మితంగా వీటిని తీసుకుంటే ఈ న్యాచురల్ పోషకాహారం అంత చక్కగా ఒంటికి పడుతుంది.