#AskKTR : తెలంగాణ మంత్రి కే తారకరామారావు ఈ సాయంత్రం నెటిజన్లతో ఆన్ లైన్ లో సంభాషించారు. ఆస్క్ కేటీఆర్ పేరిట ఆన్ లైన్లో తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కొవిడ్ నియంత్రణ సంబంధిత అంశాలపైన ప్రజలతో ట్విట్టర్ వేదికగా ఆయన సంభాషించారు. ఈ సందర్బంగా ఒక నెటిజన్ కేటీఆర్ కు ఆసక్తికర ప్రశ్న వేశారు. కరోనా సోకిన సందర్భంగా మానసిక, శారీరక ఆరోగ్యం పైన అత్యంత ప్రభావం చూపిస్తున్నదని, ఈ విషయంలో కొవిడ్ ను ఎలా ఎదుర్కొన్నారు, కొవిడ్ వచ్చిన వారికి మీరిచ్చే టిప్స్ ఏమిటి..? అని ఒకరు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ పూర్తిస్థాయిలో స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. సొంత వైద్యం పనికిరాదని కేవలం వైద్యులు నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. మానసికంగా బలంగా ఉండాలని, కొవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ వంటివాటికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోద్దన్నారు. వీలుంటే వ్యాయామం చేస్తే మంచిదన్నారు.
తనకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడు రోజులపాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డీగ్రీల జ్వరం కొనసాగిందని, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదని… తాను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్ మరియు హైపర్టెన్షన్ నియంత్రణ కొంత సవాలుగా ఉండిందని, అయితే డాక్టర్ల సరైన సూచనలు సలహాలతో అధికమించానన్నారు. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తుందని, అయినప్పటికీ సాధారణ స్థితికి చేరుకున్నానని కేటీఆర్ తన కొవిడ్ రికవరీ అనుభవాన్ని పంచుకున్నారు. కాగా, ఆస్క్ కేటీఆర్ పేరిట జరిగిన ఈ సంభాషణ జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్లో నంబర్ వన్ గా నిలవడం విశేషం.