మారుతున్న కాలంతో పాటు మనమూ, మన జీవన శైలి మారుతోంది. ఒకప్పుడు టాయిలెట్ కు వెళ్లాలన్నా, బహిర్భూమికి వెళ్లాలన్నా.. ఊరి చివరకు ఎవరూ లేని, చూడని ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. అప్పటి పరిస్థితులు మహిళలకు చాలా ఇబ్బందిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూళ్లు మినహా.. దాదాపు అన్ని ఊళ్లలోనూ ఇంటికో బాత్రూమ్ ఉంది. ముఖ్యంగా మహిళలకు టాయిలెట్ కు వెళ్లే ఇబ్బందులు తీరాయి. అయితే.. ఇప్పుడు అదే టాయిలెట్ లో చాలామంది పేపర్ చదువుతూనో, మొబైల్ చూసుకుంటూనో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
టాయిలెట్ కు వెళ్లి.. పని ముగించుకుని త్వరగా బయటకు రావడం లేదు. ఇలా 5-10 నిమిషాలకంటే ఎక్కువ సమయం టాయిలెట్ లో గడపడం అంతమంచిది కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అలవాటు ఆరోగ్యానికి నేరుగా హాని చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ కు చెందిన టాప్స్ టైల్స్ అనే ఓ కంపెనీ వారానికి ప్రజలు సగటున ఎన్నిగంటలు టాయిలెట్ లో గడుపుతున్నారని సర్వే చేయగా.. అక్కడ ఒక్కొక్కరు సుమారు మూడున్నర గంటలు బాత్రూమ్ లలో ఉంటున్నారని తేలింది. ఒక వ్యక్తి రోజుకి 4 -7 సార్లు టాయిలెట్ కి వెళ్తున్నట్లు ఈ సర్వే పేర్కొంది.
ఒక్క సిట్టింగ్ లో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయంలో టాయిలెట్ లో కూర్చుంటే.. అది పైల్స్ కి దారి తీస్తుందని హెచ్చరించారు. పాయువు లోపలి రక్తనాళాలు ఎర్రబడి, ఒక ముద్దగా ఏర్పడినపుడు మూలశంక వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఎక్కువ సమయం టాయిలెట్ లో గడిపితే.. ఆ ప్రభావం పురీషనాళంపై అధికంగా ఉంటుందని తెలిపారు.
టాయిలెట్ సీటుపై ఎక్కువ సమయం కూర్చున్నా, బవంతంగా టాయిలెట్ కు వెళ్లాల్సి వచ్చినా.. పురీషనాళం నుంచి రక్తస్రావం అవుతుందట. అలాగే టాయిలెట్ లో ఉండే క్రిముల ద్వారా త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే.. ఇప్పటికైనా టాయిలెట్ లో ఎక్కువ సమయం గడిపే అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. లేదంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి