AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్చ్.. సిగరెట్ కాలుస్తున్నారా..? తండ్రి కావడం కష్టమేనట.. నిమ్స్ వైద్యుల పరిశోధనలో సంచలన విషయాలు

సిగరెట్ తాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులే కాదు, పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ధూమపానం చేసే పురుషుల్లో వీర్యకణాల ఆకృతి, నాణ్యత దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. బెంగళూరులోని ఓ ఐవీఎఫ్ కేంద్రంలో నిర్వహించిన అధ్యయనంలో సిగరెట్ అలవాటు ఉన్నవారిలో వీర్యకణాల నిర్మాణ లోపాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తండ్రి కావాలనుకునే పురుషులు ధూమపానానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్చ్.. సిగరెట్ కాలుస్తున్నారా..? తండ్రి కావడం కష్టమేనట.. నిమ్స్ వైద్యుల పరిశోధనలో సంచలన విషయాలు
Smoking
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 11:07 AM

Share

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ల మీద ఎంత పెద్ద అక్షరాలతో రాసినా స్మోకర్స్ అస్సలు పట్టించుకోరు.. గుండె, ఊపిరితిత్తులు పాడవుతాయని మాత్రమే చాలామంది అనుకుంటారు. కానీ, సిగరెట్ అలవాటు మగవారిని తండ్రులు కాకుండా చేసే ప్రమాదం ఉందనే షాకింగ్ విషయాన్ని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పొగతాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులే కాదు.. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులోని IVF సెంటర్‌లో తెలుగు రాష్ట్రాల వైద్యులు నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో ధూమపానం వల్ల వీర్యకణాల నాణ్యత ఏ విధంగా పడిపోతుందో వెల్లడించారు. సిగరెట్ తాగే వారిలో, తాగని వారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక దాదాపు ఒకేలా ఉన్నట్లు కనిపించినప్పటికీ.. అంతర్గత నాణ్యతలో మాత్రం భారీ తేడాలు కనిపించాయి. పొగతాగే అలవాటు ఉన్నవారిలో వీర్యకణాల ఆకృతి దెబ్బతింటున్నట్లు గుర్తించారు. కణాల తల భాగంలో లోపాలు, మెడ భాగంలో సమస్యలు, తోక భాగంలో వంకరలు వంటి లోపాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఆకృతి లోపాల వల్ల వీర్యకణాలు అండం వైపు వేగంగా ప్రయాణించలేవు. ఒకవేళ చేరినా కూడా ఫలదీకరణ చెందే శక్తి ఉండదని వైద్యులు వివరిస్తున్నారు.

సిగరెట్ పొగలో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, కాడ్మియం వంటి ప్రమాదకర రసాయనాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను పెంచుతాయి. ఇది నేరుగా వీర్యకణాల డీఎన్‌ఏపై ప్రభావం చూపుతుంది. హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, వీర్యకణాల ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది. సంతానలేమి సమస్య ఎదురైనప్పుడు కేవలం ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోదని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సిగరెట్ మానకుండా ఐవీఎఫ్ వంటి ఖరీదైన చికిత్సలు చేయించుకున్నా కూడా అవి విఫలమయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్లినికల్ స్టడీ కోసం ఐవీఎఫ్ సెంటర్‌కు వచ్చిన 300 మంది పురుషులను నిపుణులు పరిశీలించారు. వీరిలో 150 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు కాగా, మిగిలిన 150 మంది ఆ అలవాటు లేనివారు. వీరి సగటు వయస్సు 34 నుంచి 35 ఏళ్లు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ అమేరా అఫ్రోజ్, ఖమ్మం మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ డి. చంద్రిప్రియ, సూర్యాపేట మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ సి. లావణ్య సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు.

సంతానలేమితో బాధపడుతూ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలోనే, పొగతాగే అలవాటు ఉన్నవారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అలవాటు నుంచి బయటపడేలా చేయాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. తండ్రి కావాలనుకునే ప్రతి పురుషుడు తన ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలని, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు స్వస్తి పలకడమే సంతాన ప్రాప్తికి మొదటి మెట్టు అని పరిశోధకులు తేల్చి చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us