సీజన్‌లో మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాతావరణంలో అలెర్జీ కారకాల వైరస్ ల సంఖ్య గాలిలో దాదాపు 200 వరకు పెరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం చాలా మంది పెద్దవాళ్లు ఏటా 2 – 4 సార్లు, పిల్లలు 5 – 7 సార్లు జలుబుతో బాధపడుతున్నట్లు తేలింది. ఉష్ణోగ్రతలలో మార్పుల కారణంగా వైరస్‌లు వృద్ధి చెందడానికి తగిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతే కాకుండా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటు వ్యాధులకు దారి తీస్తుంది. ఉష్ణోగ్రతలలో స్వల్ప మార్పు కూడా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సంవత్సరంలో సెప్టెంబర్ చివర, అక్టోబర్ మొదట్లో వాతావరణంలో పెను మార్పులు వస్తుంటాయి. వర్షాలు కురవడం, ఉష్ణోగ్రతలు పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఉదయం వేళలు తగ్గిపోయి రాత్రి పరిమాణం పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలో మార్పులతో ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులకు వీటికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య పరిశోధన ప్రకారం.. జలుబు సాధారణ సమస్యగా మారిపోయిందని చెబుతున్నారు. ఇది దాదాపుగా ఒక సంవత్సరంలో సీజన్ ఎన్నిసార్లు మారుతుందనే దానితో సమానంగా ఉంటుంది.
డబ్ల్యూహెచ్ఓ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలో మార్పు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి వ్యాధి సీజన్‌గా మారుతుందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలలో స్వల్ప మార్పు కూడా వారి పరిస్థితిని క్లిష్టతరం చేస్తుందంటున్నారు. దగ్గు, జలుబు, వైరల్ సమస్యల కారణంగా బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పారు. వృద్ధులకు అనారోగ్యం వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హౌరాలోని నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లోని జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ నీలాంజన్ పత్రనాబిస్ మాట్లాడుతూ.. సీజన్‌లు మారినప్పుడల్లా ప్రజలు ఎక్కువగా వాతావరణంలో మార్పులకు గురవుతారని, ఉష్ణోగ్రతల్లో మార్పులు వైరస్‌లు వృద్ధి చెందేందుకు అవసరమైన పరిస్థితిని అందిస్తుందని చెప్పారు. అంతే కాకుండా ఇది అంటు వ్యాధులనూ వ్యాప్తి చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
జలుబు, ఫ్లూ సాధారణ ఆరోగ్య సమస్యలు అయినప్పటికీ ప్రారంభ దశలో జాగ్రత్త తీసుకోకపోతే ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. చివరకు ఆసుపత్రికి దారి తీయవచ్చు. కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ లో మార్పులతో సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. మంచి పరిశుభ్రత పాటించాలి. రైనో వైరస్ లు శరీరం బయట 3 గంటల పాటు జీవించి ఉంటాయి. స్విచ్ బోర్డులు, డెస్క్ టేబుల్స్ వంటి వాటిపై 48 గంటల వరకూ జీవిస్తాయి. కాబట్టి చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవాలి. వ్యాయామం చేయాలి. ఇలా చేసే వ్యక్తులు వారి రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కడుపు నిండా తినడంతో పాటు కంటి నిండా విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం వంటివి సీజనల్ అనారోగ్యాన్ని బాగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి