పూనమ్ పాండే చేసిన పనికి.. సోషల్ మీడియా ఊగిపోతోంది. చాలామంది ఆమెపై విరుచుకుపడుతుంటే.. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెరగడంతో మరికొందరు అభినందిస్తున్నారు. అటు కేంద్రం ప్రకటన ఆ తర్వాతే పూనమ్ వ్యవహారంతో.. దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలేంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా సోకుతుంది? నివారణ ఉందా? చికిత్స ద్వారా నయం అవుతుందా? మహిళల్లో ఇది ఎంత ప్రభావం చూపుతుంది?.. పూనం పాండే డెత్ స్టంట్ తర్వాత.. సర్వైకల్ క్యాన్సర్‌పై దేశవ్యాప్తంగా సీరియస్‌గా చర్చ జరుగుతోంది. అసలేంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎందుకి కేంద్రం సీరియస్‌గా తీసుకుంటోంది? బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్.. బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిజానికి భారత్‌లో అత్యధికంగా వెలుగు చూస్తోన్న క్యాన్సర్‌లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. లక్షల సంఖ్యలో సర్వైకల్ క్యాన్సర్ బాధితులు మన దేశంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 3లక్షల 42వేల 333 మంది ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ఎక్కువ మంది బాధితులున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 11వ స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 17,146 మంది, తెలంగాణలో 11,525 మంది బాధితులు ఉన్నట్లు ప్రకటించింది కేంద్రం. సర్వైకల్ క్యాన్సర్.. మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్లలో నాలుగోది. మన దేశంలోనూ దీని ప్రభావం ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో నాలుగో వంతు, మరణాల్లో మూడో వంతు మన దేశం నుంచే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15-20 ఏళ్లు పడుతుంది. కానీ, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5-10 ఏళ్లలోనే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, అతిగా గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారంపర్యంగా, ధూమపానం.. ఇలాంటి కారణాలతో సంక్రమించే అవకాశముంది.
ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా మెనోపాజ్ దశలోనూ బ్లీడింగ్ అవుతుంది. దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి.. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంటగా అనిపిస్తుంది. పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్ల వాపు వంటి సమస్యలున్నా సర్వైకల్ క్యాన్సర్‌గా అనుమానించాలి. ఈ క్యాన్సర్ లక్షణాలు కన్పించగానే దాన్ని నిర్ధరించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనది ‘పాప్‌స్మియర్’ టెస్టు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షతో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధరించుకోవచ్చు. క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు, వీటికి మించి.. సెక్స్ ముందు, తర్వాత జననేంద్రియాలను శుభ్రపరచకపోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రజలు.. ముఖ్యంగా మహిళలు దీనిపై అవగాహన పెంచుకోవాలంటున్నారు. దీనిపైనే పూనమ్ పాండే డెత్ స్టంట్ చేసింది.
ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9-26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 9-14 ఏళ్ల లోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దేశీయంగా ఈ టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.