PMSBY: దేశంలో ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్రప్రభుత్వం ఎన్నో బీమా పథకాలను అందజేస్తోంది. కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి అనుకోకుండా ప్రాణాలు కోల్పోతే.. ఆకుటుంబం పెద్ద దిక్కు కోల్పోతుంది. అందుకే అతి తక్కువ ప్రీమియంతో ఎన్నో బీమా పథకాలను అందిస్తోంది. వీటిలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ఒకటి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండటంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోవడంతో పాటు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వారికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యెజన పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక ప్రకారం.దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. 2020 నుంచి 2021 వరకు 16.8 శాతం ప్రమాదాలు పెరిగాయి. 2021లో 1,55,622 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, అదే ఏడాది 4,03,116 రోడ్డు ప్రమాదాల్లో 3,71,884 మంది గాయపడ్డారు. ప్రయివేటు సంస్థల్లో బీమా తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువుగా ఉంటుంది. దీంతో చాలా మంది ఇన్స్యూరెన్స్ తీసుకోరు. అటువంటి వారి కోసం అతితక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా చేయించుకునే అవకాశాన్ని కేంద్రప్రభుత్వం కల్పిస్తోంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే వ్యక్తి ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేయడం ద్వారా రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందవచ్చు. ఈపథకంలో చేరే వ్యక్తులు బ్యాంకులో సేవింగ్ ఖాతా కలిగి ఉండాలి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అధికారిక వెబ్ సైట్ లేదా ఇక్కడ లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెబ్ సైట్ ని సందర్శించి ఈపథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారం పొందవచ్చు. అప్లికేషన్ లో పొందుపర్చిన వివరాలు పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్ల నకలు జతపరచి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. ఈపథకం కోసం అకౌంట్ లోనుంచి రూ.20 తీసుకుంటారు.
ఎవరు అర్హులు: 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈపథకానికి అర్హులు. ఈపథకంలో లబ్ధిదారులు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 ఆర్థిక సాయం పొందొచ్చు. ఒకవేళ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.లక్ష ఆర్థిక సాయం లభిస్తుంది. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న వారు ఈపథకంలో చేరొచ్చు.
క్లెయిమ్ చేసే విధానం: ఈపథకంలో చేరిన లబ్ధిదారుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తి యొక్క నామినీ బ్యాంకు, బీమా కార్యాలయానికి వెళ్లి క్లెయిమ్ ఫారమ్‌ను పూర్తిచేయాలి. బీమా చేయబడిన వ్యక్తి తన పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంకు శాఖలో బీమా చేయబడిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా కవర్ మొత్తం నామినీ ఖాతాలోకి బదిలీ అవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..