National Dengue Prevention Day 2022: డెంగ్యూ అనేది సోకిన దోమల కాటు ద్వారా మానవులకు సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. దీనివల్ల ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. డెంగ్యూకి కారణమయ్యే వైరస్‌ను డెంగ్యూ వైరస్ (DENV) అంటారు. దీనిలో నాలుగు DENV సెరోటైప్‌లు ఉన్నాయి.. కావున నాలుగు సార్లు సోకే ప్రమాదం ఉంది. డెంగ్యూ జ్వరం లేదా డెంగ్యూ వైరస్ లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత మూడు నుంచి పద్నాలుగు రోజుల తరువాత ప్రారంభమవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు లాంటివి కనిపిస్తాయి.. డెంగ్యూను నియంత్రించేందుకు ప్రభుత్వం ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే క్రమంలో ఈ రోజు వ్యాధి గురించి అవగాహన కల్పించడం, డెంగ్యూ చికిత్సకు నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా.. ఢిల్లీ ద్వారకాలోని హెచ్‌సిఎమ్‌సిటి మణిపాల్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ హెచ్‌ఓడి, కన్సల్టెంట్ డాక్టర్ చారు గోయెల్ సచ్‌దేవా న్యూస్9తో ప్రత్యేకంగా మాట్లాడారు. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్ ఇన్‌ఫెక్షన్ అని.. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఈడిస్ ఈజిప్టి అనే ఆడ దోమ కుట్టడం ద్వారా ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుందని.. దీంతో తీవ్ర అనారోగ్యంతోపాటు.. మరణాలు కూడా సంభవిస్తాయని డాక్టర్ గోయెల్ చెప్పారు. డెంగ్యూ ఇన్ఫెక్షన్ వ్యాప్తి గురించి.. అలాగే.. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాలను ఎలా గుర్తించాలి అనే విషయాలను డాక్టర్ చారు గోయెల్ సచ్‌దేవా పలు సూచనలు చేశారు.
70 శాతం కేసులు ఆసియాలోనే..
డెంగ్యూలో మానవులకు సోకే నాలుగు వైరల్ సెరోటైప్‌లు ఉన్నాయి. జీవితకాల రోగనిరోధక శక్తికి సోకిన సెరోటైప్‌తో ఆటంకం కలుగుతుంది. అయితే దీంతో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంది. డెంగ్యూ కేసుల్లో డెబ్బై శాతం ఆసియాలో ఉన్నాయి. భారతదేశంలో.. ప్రతి సంవత్సరం ఇన్ఫెక్షన్ పునరావృతమవుతూనే ఉంది. డెంగ్యూకి ఇంకా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. అయితే రాబోయే ఐదేళ్లలో ఒక ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. డెంగ్యూ రకాలలో యాంటీజెనిక్ వైవిధ్యాల కారణంగా టీకాలు పరిమిత పాత్రను కలిగి ఉంటాయని డాక్టర్ గోయెల్ అభిప్రాయపడ్డారు.
డెంగ్యూ జ్వరం క్లినికల్ లక్షణాలలో.. తేలికపాటి స్వీయ-పరిమిత వైరల్ సంక్రమణ నుంచి బహుళ అవయవ వైఫల్యానికి దారితీసే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వరకు మారుతూ ఉంటాయి. అధిక జ్వరం, తీవ్రమైన శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, కళ్లలో నొప్పి, చర్మంపై దద్దుర్లు, వికారం వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలలో జ్వరం, నొప్పి, రోగలక్షణ ఉపశమనం కోసం ఎసిటమైనోఫెన్‌తో సులభంగా చికిత్స చేయవచ్చు.
అయితే.. డెంగ్యూ హెమరేజిక్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన వ్యక్తీకరణలని డాక్టర్ గోయెల్ తెలిపారు. డెంగ్యూ లక్షణాలలో తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మలబద్ధకం, నీరసం, చిగుళ్ళు లేదా ముక్కు నుంచి రక్తస్రావం లేదా శ్లేష్మ రక్తస్రావం, చర్మం చల్లబడటం, రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 20 శాతం క్షీణించడం, ప్లేట్‌లెట్ కౌంట్ తీవ్రంగా పడిపోవడం లాంటివి కనిపిస్తాయని ఆమె తెలిపారు.
టైఫాయిడ్ – మలేరియా లాగానే డెంగ్యూ లక్షణాలు.. జాగ్రత్తగా ఉండటం మంచిది..
మలేరియాలో.. అధిక-స్థాయి జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు లాంటివి కనిపిస్తాయి. వైద్యపరంగా డెంగ్యూ – మలేరియా మధ్య తేడాను గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. ఈ సందర్భంలో మలేరియాకు నిర్దిష్ట చికిత్స అందుబాటులో ఉన్నందున పరీక్ష తప్పనిసరి.
టైఫాయిడ్ జ్వరం.. మలబద్ధకం లేదా అతిసారం వంటి ఉదర లక్షణాలతో కూడా ఉంటుంది. జ్వరం మితమైన స్థాయి నుంచి అధిక స్థాయి వరకు ఉండవచ్చు. పొడి దగ్గు, తలనొప్పితో కూడా ఉంటుంది. నిర్దిష్ట చికిత్స కోసం వీలైనంత త్వరగా రక్త పరీక్ష చేయించడం ఉత్తమం.
డెంగ్యూ.. డెంగ్యూ జ్వరానికి చికిత్స వీలైనంత త్వరగా ప్రారంభించాలి. రోగులందరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. చాలా మందికి జ్వరాన్ని తగ్గించడానికి మందులతో సులభంగా చికిత్స చేయవచ్చు ఎసిటమైనోఫెన్, ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి వాటితో ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలో రోగి పుష్కలంగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని ప్రోత్సహించాలని డాక్టర్ గోయెల్ సలహా ఇచ్చారు.
తీవ్రత ఎక్కువైతే మరింత ప్రమాదం..
బాధిత వ్యక్తుల ప్లేట్‌లెట్ కౌంట్ ఇతర ప్రాథమిక లక్షణాలను తనిఖీ చేయడడంతోపాటు, రోగి రక్త పరీక్షలను జరపడం చాలా ముఖ్యం. ఆసుపత్రులలో చేరే రోగులకు లక్షణాలు, సంకేతాలను చూస్తారు. వారి రక్తపోటు, ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, మూత్ర విసర్జనను నిశితంగా పరిశీలించాలి. తరచుగా రక్త పరీక్షలతో పాటు IV ఇంజెక్షన్స్, ప్లేట్‌లెట్ కౌంట్, ఆ తర్వాత మరి తగ్గితే.. ప్లెట్ లెట్ లను అందించడం లాంటి చర్యలు అవసరం కావచ్చు. ఇలాంటి సందర్భంగా డెంగ్యూ తీవ్రంగా మారితే అధిక మరణాలు సంభవించవచ్చు అని డాక్టర్ గోయెల్ హెచ్చరించారు.
సంక్రమణ వాతావరణ మార్పులపై కూడా ఆధారపడి ఉంటుంది..
ఈ ఏడాది రాజధానిలో డెంగ్యూ కేసులు 80కి పైగా పెరిగాయి. ఇవి పెరుగుతున్న వేడికి సంబంధించినది కావచ్చు. వాతావరణ మార్పులతో.. జనాభా అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో.. దోమల పెరుగుదల కూడా ఉంది. ఇది దోమల కాటుకు దారి తీస్తుంది. ఈ సంక్రమణ నివారణ చాలా ముఖ్యమని అవగాహన కల్పించడం ముఖ్యం.. దోమలు నీటి నిల్వ అధికంగా ఉన్న ప్రాంతాలో సంతానోత్పత్తి చేస్తాయి. అందువల్ల నీటిని ఖాళీ చేయడం తప్పనిసరి అని డాక్టర్ గోయెల్ వివరించారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా.. మనం ఫుల్ స్లీవ్‌లు ధరించడానికి, కాళ్లను కప్పుకోవడానికి ఇష్టపడటం లేదని ఆమె పేర్కొన్నారు. దోమలు ప్రధానంగా చేతులు, కాళ్ళ ప్రదేశాల్లోనే కాటేస్తాయి. దోమల నియంత్రణకు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాఠశాలలు, కార్యాలయాలు పునఃప్రారంభించడంతోనే ఓవర్‌హెడ్ ట్యాంక్, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి.. నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇళ్లల్లో కూడా చర్యలు తీసుకోవాలని డాక్టర్ గోయల్ సూచించారు.