Vitamin B12 Foods: ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్, పిండి పదార్థాలు లాంటివి శరీరానికి చాలా అవసరం. చాలా పోషకాలు సాధారణంగా ఆహారం, పలు రకాల పానీయాల నుంచే శరీరానికి అందుతాయి. అయితే.. అలాంటి విటమిన్లల్లో బి 12 విటమిన్ శరీరానికి చాలా ఉపయోగమైనది. సాధారణంగా ఇది శాఖాహార ఆహార పదార్థాలలో ఉండదు. కేవలం మాంసాహార పదార్థాలలోనే ఉంటుంది. దీనిద్వారా శరీరం ఆరోగ్యవంతంగా మారుతుందని.. బి 12 ఎంతో ఉపయోగకరమైనదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్ బి 12 ను కోబాలమిన్ అని కూడా అంటారు. అయితే.. అందరూ తినే శాఖాహార ఆహారంలో విటమిన్ బి 12 లేకపోవడం వల్ల.. చాలా మందికి ఈ విటమిన్ లోపం ఉంది. దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరానికి విటమిన్ బి 12 ఎందుకు ముఖ్యమో, దాని లోపం వల్ల కలిగే లక్షణాలు ఏమిటి..? దాని లోపాన్ని ఎలా తీర్చవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో విటమిన్ బి 12 పాత్ర..
శరీరంలో ఎర్ర రక్తకణాలు ఏర్పడటంలో, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్ బి 12 ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా మారుతుంది. విటమిన్ బి 12 మెదడు దెబ్బతినడం, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు విటమిన్ బి 12 ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. కావున ఈ విటమిన్‌ను యాంటీ-స్ట్రెస్ విటమిన్ అని కూడా అంటారు.
ఈ లక్షణాలు విటమిన్ బి 12 లోపం ఉన్నట్లే..
రక్తహీనత, అలసట, శరీర బలహీనత, ఆకలి లేకపోవడం, చిరాకు, వణుకు, జుట్టు రాలడం, నోటి పూత, మలబద్ధకం, జ్ఞాపకశక్తి తగ్గడం, అధిక టెన్షన్, తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు, చర్మం పసుపుగా మారడం, కంటి చూపు తగ్గడం.. లాంటివన్నీ బి 12 లోపం ప్రధాన లక్షణాలుగా పరిగణిస్తారు. ఒకవేళ మీకు కూడా ఇలాంటివి ఉంటే.. వైద్య నిపుణులను సంప్రదించడం మేలని సూచిస్తున్నారు.
విటమిన్ బి 12 లోపానికి కారణాలు..
విటమిన్ బి 12 ఎక్కువగా మాంసాహార పదార్థాలలో ఉంటుంది. కావున శాఖాహారులు ఈ విటమిన్ లోపంతో బాధపడతారు. దీంతోపాటు ఏదైనా శస్త్రచికిత్స జరిగితే.. వారికి శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. ఈ పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణం విటమిన్ బి 12 లోపం. బి 12 లోపం ఉన్న వ్యక్తులు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
లోపాన్ని ఇలా అధిగమించండి..
విటమిన్ బి 12 లోపం ఉన్న వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. చేపలు, చికెన్, గుడ్లు, రొయ్యలలో బి12 ఎక్కువగా లభిస్తుంది. మీరు మాంసాహారులైతే వీటిని ఎక్కువగా తింటే మంచిది. అయితే.. శాకాహారులు పెరుగు, ఓట్స్, సోయాబీన్స్, బ్రోకలీ, టోఫు లాంటివి తినడం ద్వారా కొంతవరకు ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఇదే కాకుండా శాకాహారులు నిపుణుల సలహాతో విటమిన్ బి 12 సప్లిమెంట్లను తీసుకోవడం ఉత్తమం. దానికోసం వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Also Read: