Telugu News Health Is Your Child Eating While Watching TV Avoid This Common Mistakes While Feeding Kids
మీ పిల్లలు టీవీ చూస్తూ తింటున్నారా..? ఇది ఎంత డేంజరో తెలుసా..? డాక్టర్ ఏం చెబుతున్నారంటే..?
ఇప్పటి పిల్లల్లో స్క్రీన్ చూస్తూ తినే అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలకి ఈజీగా తినిపించేందుకు పేరెంట్స్ చేసే చిన్న పని ఇది. కానీ దీని వల్ల కలిగే బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆకలి, ఆరోగ్యం, ఫ్యామిలీ బాండింగ్‌పై దీని ఎఫెక్ట్ ఉంటుంది. స్క్రీన్ లేకుండా తినే అలవాటు చేస్తే పిల్లల భవిష్యత్తు హెల్తీగా ఉంటుంది.
మీ పిల్లలు టీవీ చూస్తూ మాత్రమే తింటున్నారా..? అయితే జాగ్రత్త..! చాలా మంది తల్లిదండ్రులు చేసే ఈ పొరపాటు వల్ల పిల్లలు కార్టూన్‌లు, రైమ్‌లు చూస్తూ తింటే సులభం అవుతుందని భావిస్తారు. కానీ దాని వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ. డాక్టర్ కరుణ్య చెప్పిన దాని ప్రకారం.. ఈ అలవాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
టీవీ చూస్తూ తినడం వల్ల కలిగే నష్టాలు
ఆకలి, తృప్తి తెలియదు.. స్క్రీన్ చూస్తూ తింటున్నప్పుడు, పిల్లలకు తాము ఎంత తింటున్నారో తెలియదు. దాని వల్ల ఎక్కువ తినేయడం లేదా సరిగా తినకపోవడం జరుగుతుంది. దీని వల్ల పోషకాహార లోపం, అధిక బరువు లాంటి సమస్యలు రావచ్చు.
స్వతంత్రంగా తినడం రాదు.. స్క్రీన్ మీద ఆధారపడి తినడం వల్ల పిల్లలు తమంతట తాముగా తినడం నేర్చుకోలేరు. ఇది వారి స్వతంత్రతను తగ్గిస్తుంది.
జీర్ణక్రియ మందగిస్తుంది.. ఏకాగ్రత లేకుండా తినడం వల్ల పిల్లలు ఆహారాన్ని సరిగా నమలరు. దాని వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది.
కుటుంబానికి దూరం.. భోజన సమయం కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా గడిపే సమయం. టీవీ, ఫోన్ వల్ల ఆ సమయం పోతుంది.
దీనికి పరిష్కారం ఏంటి..?
స్క్రీన్ లేకుండా తినడం అలవాటు చేయండి.. ఇంట్లో భోజనానికి టీవీ, ఫోన్ లేకుండా ఒక రూల్ పెట్టుకోండి.
అందరూ కలిసి తినండి.. కుటుంబమంతా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినండి.
ఆహారం గురించి చెప్పండి.. తిండి రంగులు, రుచులు, వాసనల గురించి పిల్లలతో మాట్లాడండి.
కథలు, పాటలు చెప్పండి.. స్క్రీన్ బదులు కథలు చెప్పడం, పాటలు పాడటం అలవాటు చేయండి.
ఈ చిన్న మార్పులు పిల్లల మంచి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. డాక్టర్ కరుణ్య చెప్పిన ఈ చిట్కాలు పిల్లల ఆరోగ్యం, మనసుపై చాలా మంచి ప్రభావం చూపుతాయి.