షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..? తింటే ఏమౌతుంది..?

మామిడి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను తినాలి అనుకుంటే కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. మామిడి పండులో ఉన్న చక్కెర ఎక్కువ.. కానీ సరిగా నియంత్రించుకుంటూ తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయవచ్చు.

షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..? తింటే ఏమౌతుంది..?
Mangoes

Updated on: Apr 29, 2025 | 12:30 PM

మామిడి పండు.. ఫలాల్లో రారాజుగా పేరుగాంచినదే కాదు పోషకాల్లోనూ అత్యంత విలువైనదిగా గుర్తించబడింది. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్లు, మినరల్స్ వంటి అనేక అవసరమైన పోషకాలు కూడా మామిడిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగా పరిగణించబడుతుంది.

అయితే డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా అన్నది చాలా మందిలో ఉన్న ప్రధాన సందేహం. దీనికి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా.. మామిడి పండ్లు తినొచ్చు కానీ మితంగా తినాలి. ఎందుకంటే మామిడి పండులో ఉన్న మొత్తం కేలరీలలో సుమారు 90 శాతం వరకు కేవలం చక్కెరల వల్లనే వస్తుంది. దీంతో మామిడి అధికంగా తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం తప్పదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు మామిడిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

మామిడి పండుకు గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. దీని వల్ల మామిడి తిన్న వెంటనే రక్తంలో షుగర్ స్థాయిలు హఠాతుగా పెరగడం కంటే క్రమంగా పెరగడం జరుగుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కొంత మేరకు అనుకూలం. అయినప్పటికీ మామిడిపండును తగిన మోతాదులో తీసుకోవడం ముఖ్యం.

ప్రతిరోజూ కొద్ది మొత్తంలో మాత్రమే మామిడిని తీసుకోవాలి. ఉదాహరణకు ఒక చిన్న ముక్క లేదా ఒక చిన్న మామిడి పండు తినడం మంచిది. మామిడిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తప్పకుండా పెరుగుతాయి. కాబట్టి మామిడిని ఎంత తినాలనే దానిపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉంచుకోవడం అవసరం.

అంతేకాకుండా, మామిడి పండు తింటున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మామిడి తిన్న వెంటనే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు మామిడి తిన్న తర్వాత కొన్ని బాదం పప్పులు, గట్టి పెరుగు లేదా ఉడికించిన గుడ్డు వంటివి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర శాతం ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించవచ్చు. మామిడి పండులో స్వల్ప మొత్తంలో ప్రొటీన్ ఉన్నా, అదనంగా ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను పూర్తిగా తినడం మానేయాల్సిన పనిలేదు. తక్కువ మొత్తంలో తీసుకుంటూ.. సరైన ఆహారంతో కలిపి తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మామిడిని తీసుకునే విధానంలో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)