Intelligent Tattoo: క్యాన్సర్‌ను కనిపెట్టే పచ్చబొట్టు.. వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ
చర్మ క్యాన్సర్‌ను కంటికి కనిపించడానికంటే ముందే గుర్తించే ‘స్మార్ట్ టాటూ’ టెక్నాలజీని కెనడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నానోపార్టికల్స్, మైక్రోనీడిల్స్ సాయంతో పనిచేసే ఈ ప్రత్యేక ప్యాచ్ క్యాన్సర్ కణాల వల్ల కలిగే సూక్ష్మ ఉష్ణోగ్రత మార్పులను గుర్తించి, కేవలం నాలుగు రోజుల్లోనే వ్యాధి సంకేతాలను వెల్లడించగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సాంకేతికత విజయవంతమైతే క్యాన్సర్ నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది..

క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం వైద్య ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ముఖ్యంగా చర్మ క్యాన్సర్‌ను కంటికి కనిపించే స్థాయికి చేరుకునే ముందే గుర్తించడం చాలా కష్టం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా కెనడా శాస్త్రవేత్తలు ఒక వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీనికి “స్మార్ట్ టాటూ” అని పేరు పెట్టారు. కెనడాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ నేషనల్ డి లా రీసెర్చ్ సైంటిఫిక్ (INRS), యూనివర్శిటీ డి మాంట్రియల్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ సాంకేతికతను రూపొందించారు. ఇది సాధారణంగా వేయించుకునే పచ్చబొట్టు కాదు. చర్మానికి ఎలాంటి నొప్పి కలిగించకుండా ఉపయోగించగలిగే ఒక ప్రత్యేక తాత్కాలిక ప్యాచ్.
ఈ ప్యాచ్‌లో సూక్ష్మమైన మైక్రోనీడిల్స్ మరియు ప్రత్యేక నానోపార్టికల్స్ ఉంటాయి. వీటిని చర్మం పై పొర కింద ప్రవేశపెట్టిన తర్వాత అవి ఒక డిజిటల్ థర్మామీటర్‌లా పనిచేస్తాయి. క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కంటే ఎక్కువ ఆక్సిజన్, పోషకాలను వినియోగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో సూక్ష్మ స్థాయిలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. స్మార్ట్ టాటూపై ప్రత్యేక కాంతిని ప్రసరించినప్పుడు, దానిలోని నానోపార్టికల్స్ తిరిగి కాంతిని విడుదల చేస్తాయి. ఆ కాంతిని హై-స్పీడ్ కెమెరాలతో విశ్లేషించడం ద్వారా ఉష్ణోగ్రతలో వచ్చిన అతి చిన్న మార్పులను కూడా గుర్తించవచ్చు. తద్వారా క్యాన్సర్ కణాలు ఏర్పడుతున్న ప్రాంతాన్ని చాలా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్కానింగ్ పద్ధతులు చర్మంపై క్యాన్సర్ మచ్చ లేదా కణితి కనీసం 5 మిల్లీమీటర్ల పరిమాణానికి పెరిగిన తర్వాత మాత్రమే గుర్తించగలవు. కానీ ఈ స్మార్ట్ టాటూ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణాలు ఏర్పడిన కేవలం నాలుగు రోజులకే వాటిని గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సాంకేతికతను ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిశోధన విజయవంతమైతే చర్మ క్యాన్సర్‌తో పాటు శరీరంలోని ఇతర వ్యాధులను కూడా ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశాలు మెరుగుపడతాయి. వైద్య రంగంలో ఈ “స్మార్ట్ టాటూ” టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




