
ఉదయం లేవగానే చేసే కొన్ని పనుల ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. అందుకే రోజు ప్రారంభించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దాని ప్రభావం రోజులో చేసే పనిపై పడి సజావుగా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఉదయం లేవగానే కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. ఏ పనులు చేస్తే ఆ రోజు బాగుంటుందో చూద్దాం.
రాత్రి 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోయినా కూడా ఉదయం అలసిపోయినట్లుగా, రోజంతా నీరసంగా అనిపిస్తుంది. అది నిద్రలేకపోవడం వల్ల కాకపోవచ్చు. మీరు ఉదయం లేవగానే చేసే కొన్ని పనులే అందుకు కారణం. చాలా మంది తమకు తెలియకుండానే తమ శక్తి స్థాయిలను తగ్గించే, జీవక్రియ నెమ్మదించే తప్పులు చేస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తప్పులు ఆ రోజుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.
రాత్రంతా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన తర్వాత నీరు తప్పనిసరిగా తాగాలి. ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగకపోతే జీవక్రియ నెమ్మదిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.
నేటి డిజిటల్ యుగంలో ఉదయం లేవగానే చాలా మంది మొదట తమ స్మార్ట్ ఫోన్లను చూస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. కళ్లు తెరిచిన వెంటనే మీ మొబైల్ ఫోన్‌ను చూడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హర్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అంతేగాక, శక్తి స్థాయిలను తగ్గించి రోజును బద్దకంతో ప్రారంభించేలా చేస్తుంది. ఫోన్ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కిరణాలు మీ కళ్లను అలసిపోయేలా చేస్తాయి. మీ మెదడు సహజ చురుకుదనాన్ని దెబ్బతీస్తాయి.
అలారం మోగగానే దాన్ని ఆపివేసి మరో ఐదు నిద్రపోవాలని కోరుకోవడం చాలా మందిలో చూస్తూనే ఉంటాం. మీ అలారం ఆపిన తర్వాత పదే పదే నిద్రపోవడం బరువు పెరగడానికి కారణం కావచ్చు. ఇది శరీర జీవ గడియారాన్ని దెబ్బతీసి, రోజంతా నీరసానికి గురిచేస్తుంది.
ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం బరువు పెరగడానికి కారణమవుతుంది. అల్పాహారం తినకపోవడం వల్ల శరీరం కొవ్వు నిల్వ చేసి రోజంతా శక్తిని తగ్గిస్తుంది.
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం జీర్ణవ్యవస్థను బలహనపరుస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఇది ఆమ్లతను పెంచుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. వీటి బదులుగా ఉదయం లేవగనే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం తిరిగి హైడ్రేట్ అవుతుంది. జీవక్రియను ప్రారంభించి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపుతుంది.