ఆరోగ్యంగా ఉన్న యువత గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారో తెలుసా..?

ఆరోగ్యంగా కనిపించే యువతలో కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె ఎలక్ట్రికల్ సిస్టమ్ లోపాలు, జన్యుపరమైన కారణాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, జీవనశైలి అలవాట్లు ఇవన్నీ ప్రమాదాన్ని పెంచుతాయి. హెచ్చరిక లక్షణాలను గుర్తించి పరీక్షలు చేయించుకోవడం. సీపీఆర్ నేర్చుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఆరోగ్యంగా ఉన్న యువత గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారో తెలుసా..?
Heart Healthy

Updated on: Aug 14, 2025 | 8:34 PM

గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని భయపెడుతున్న సమస్య. ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు లేకుండానే ఆరోగ్యంగా ఉన్న యువత గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని సడన్ కార్డియాక్ అరెస్ట్ (SCA) అంటారు. గుండె లోపలి ఎలక్ట్రికల్ సిస్టమ్‌ లో సమస్య వల్ల ఇది వస్తుంది. దీంతో రక్తప్రసరణ ఆగిపోయి. వ్యక్తి స్పృహ కోల్పోతాడు. వెంటనే సీపీఆర్ (CPR) ఇవ్వకపోతే ప్రాణాలకు ప్రమాదం.

యూత్‌ లో ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్‌ లు పెరగడానికి కారణాలు ఏంటి..? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) పరిశోధన ప్రకారం కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జన్యుపరమైన సమస్యలు

కొంతమందికి వారసత్వంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి గుండె కొట్టుకునే తీరులో లోపాలు సృష్టించి ప్రాణాలను తీయవచ్చు. ఇవి మొదట్లో ఎలాంటి లక్షణాలు చూపించవు. అందుకే కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యల చరిత్ర ఉంటే జన్యు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

గుండె సంబంధిత వ్యాధులు

యువతలో ఇప్పటికే ఉన్న గుండె వ్యాధులు.. వాటిని గుర్తించకపోవడం కూడా దీనికి కారణం. ఇలాంటి సమస్యలను ముందుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు.

వైరల్ ఇన్ఫెక్షన్లు

వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల గుండె కండరాలకు వాపు రావచ్చు. దీనిని మయోకార్డిటిస్ (Myocarditis) అంటారు. ముఖ్యంగా కోవిడ్ 19 తర్వాత ఈ సమస్య ఎక్కువైందని పరిశోధనలు చెబుతున్నాయి. వైరస్ గుండెను బలహీనపరచి.. సడన్ కార్డియాక్ అరెస్ట్‌కి దారితీయవచ్చు.

ఎలక్ట్రికల్ లోపాలు

వోల్ఫ్-పార్కిన్సన్-వైట్ సిండ్రోమ్ (Wolff-Parkinson-White syndrome), బ్రుగాడా సిండ్రోమ్ (Brugada Syndrome) వంటి కొన్ని ఎలక్ట్రికల్ సమస్యలు గుండె లయను దెబ్బతీస్తాయి. ఇవి సాధారణ చెకప్‌ లలో కనిపించవు. ఈసీజీ (ECG), ఎకోకార్డియోగ్రామ్ (Echocardiogram) వంటి ప్రత్యేక పరీక్షలు మాత్రమే వీటిని గుర్తించగలవు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువ ఒత్తిడి, తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

జీవనశైలి అలవాట్లు

  • ఎనర్జీ డ్రింక్స్, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
  • డీహైడ్రేషన్, మత్తు పదార్థాల వినియోగం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.
  • అతిగా వ్యాయామం చేయడం గుండెపై అధిక భారాన్ని మోపుతుంది.

నివారణ, జాగ్రత్తలు ఏంటి..?

  • తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. కుటుంబ చరిత్ర ఉంటే జన్యు పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
  • గుండెపోటు హెచ్చరిక లక్షణాలు (చాతి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణంగా గుండె కొట్టుకోవడం) కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  • అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ (CPR) ఎలా చేయాలో నేర్చుకోండి. చాలా ప్రాణాలను కాపాడవచ్చు.
  • ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, వ్యసనాలకు దూరంగా ఉండటం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)