జ్యూస్‌లో ఐస్ వేసుకుని తాగుతున్నారా..? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?

ఎండలు పెరిగినప్పుడు చల్లని డ్రింక్స్ ల పట్ల అందరికీ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకునే వారికి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు, కానీ బయట దొరికే జ్యూస్‌లు తాగేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల కలుషిత నీటితో తయారైన ఐస్‌ను జ్యూస్‌ల్లో కలిపి ఇస్తున్నారు. ఇది తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మందికి విషయం తెలియకపోవచ్చు కానీ మురికి నీటితో తయారైన ఐస్ వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

జ్యూస్‌లో ఐస్ వేసుకుని తాగుతున్నారా..? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?
Drinks In Summer

Updated on: Mar 31, 2025 | 6:48 AM

ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది చల్లని జ్యూస్‌లను ఎక్కువగా తాగుతున్నారు. మరికొందరు వీలైనంత ఎక్కువ ఐస్ వేసుకుని తాగుతున్నారు. చల్లగా ఉంటుందని తాగినప్పటికీ దీని వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాన్ని గుర్తించలేరు. నిజానికి ఐస్‌ను రెండు రకాలుగా తయారు చేస్తారు. ఒకటి స్వచ్ఛమైన నీటితో తయారైనది. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి.. ఎక్కువగా హోటళ్లలో వాడుతారు. మరొకటి రా ఐస్.. అంటే మురికి నీటితో తయారైన మంచు. ఈ రా ఐస్‌లో మలినాలు, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. దీనిని తాగినప్పుడు శరీరంలోకి అనేక హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించి జీర్ణ సంబంధ సమస్యలను తలెత్తించొచ్చు.

కలుషితమైన మంచు కలిపిన జ్యూస్‌ల వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధ ఇబ్బందులు, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొందరికి తీవ్రమైన కడుపు నొప్పి కూడా రావొచ్చు. అలాగే గొంతు సమస్యలు రావచ్చు. చల్లని ఐస్ వల్ల గొంతు బొంగురుపోవడం, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఇది మరింత హానికరం. అస్వచ్ఛమైన మంచు వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగించవచ్చు. ఇది ఆస్తమా, బ్రాంకైటీస్, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారికి మరింత ప్రమాదకరం.

ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బయట దొరికే జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్ తాగడం తగ్గించాలి. వీలైనంతవరకు ఇంట్లోనే స్వచ్ఛమైన నీటితో తయారు చేసుకున్న జ్యూస్‌లను తాగాలి. కూల్‌డ్రింక్స్‌కి బదులుగా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి సహజమైన డ్రింక్స్ లను తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా బావి నీరు, శుద్ధి చేయని నీటితో తయారైన ఐస్‌ను పూర్తిగా దూరం పెట్టాలి. బయటికి వెళ్లే ముందు ఇంట్లోని వాటర్ బాటిల్‌ తీసుకెళ్లడం కూడా ఆరోగ్యానికి మంచిది.

చల్లని డ్రింక్స్ తాగడం వల్ల తాత్కాలికంగా హాయిగా అనిపించినా దీని ప్రభావం చాలా రోజులు ఆరోగ్యంపై పడవచ్చు. మురికి నీటితో తయారైన ఐస్‌ను కలిపిన జ్యూస్‌లు తాగడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంట్లోనే శుభ్రమైన నీటితో చేసిన డ్రింక్ లను తాగడం ఉత్తమం.