Health Tips: ఈ 11 లక్షణాలను మహిళలు అస్సలు విస్మరించకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

|

Mar 11, 2022 | 5:52 PM

Health Tips: స్త్రీలు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పనిలో బిజీ బిజీగా గడుపుతుంటారు. మల్టీటాస్క్‌లతో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు.

Health Tips: ఈ 11 లక్షణాలను మహిళలు అస్సలు విస్మరించకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Women
Follow us on

Health Tips: స్త్రీలు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పనిలో బిజీ బిజీగా గడుపుతుంటారు. మల్టీటాస్క్‌లతో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఇల్లు, కుటుంబం, ఉద్యోగం సహా అనేక విషయాలను వారు హ్యాండిల్ చేస్తుంటారు. అన్ని విషయాలను పట్టించుకుంటూ బిజీగా ఉండే స్త్రీలు.. తమ ఆరోగ్యం పట్ల మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యంగా చేస్తుంటారు. దీర్ఘకాలిక శరీర నొప్పులు, అధిక బరువు వంటి సమస్యలను లైట్ తీసుకుని వదిలేస్తుంటారు. అయితే, ఇవి తీవ్రమైనవిగా కనిపించకపోవడంతో వారు వాటిని పెద్దగా లక్ష్యపెట్టరు. కానీ, ఆ చిన్న చిన్న సమస్యలే తదుపరి కాలంలో తీవ్ర సమస్యలు పరిణమించే అవకాశం ఉంది. ముఖ్యంగా 11 రకాల లక్షణాలను మహిళలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి 11 లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: కొన్నిసార్లు స్త్రీలు తమ గుండె కండరాలకు తగినంత రక్త సరఫరా లేనప్పుడు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు. తద్వారా.. మహిళలు ‘నిశ్శబ్ద గుండెపోటు’కు గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి కంటే శ్వాస ఆడకపోవడం, విపరీతమైన అలసట. మహిళల్లో శ్వాస ఆడకపోవడానికి ఇతర సాధారణ కారణాలు రక్తహీనత, ఊపిరితిత్తుల వ్యాధి అయి ఉంటుంది. ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2. ఛాతీ నొప్పి, వేగవంతమైన హృదయ స్పందన: ఛాతీ నొప్పి, వేగవంతమైన హృదయ స్పందన, మీ చేతులు, భుజాలు లేదా దవడలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటుంటే అది గుండె సంబంధిత సమస్యల వల్ల ఏర్పడే సమస్యలు కావొచ్చు. గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే ధమనులు దెబ్బతినడం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంది. ఇది అరుదైనది యువకులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే పురుషుల కంటే మహిళల్లో తరచుగా సంభవిస్తుంది.

3. ఆకస్మిక అలసట: ఆకస్మిక బలహీనత స్ట్రోక్‌ను సూచిస్తుంది. మానసిక గందరగోళం, మాటల్లో తడబాటు, అస్పష్టమైన దృష్టి, నడవడం కష్టంగా ఉండటం వంటివి అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మీరు ఎదుర్కొనే సమస్యలను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తెలియజేయాలి. లక్షణాలు తెలిస్తే ఏదైనా ప్రమాద సమయంలో తక్షణ వైద్య సాయం పొందడానికి వీలుంటుంది.

4. ఋతు కాలాల్లో మార్పులు: ఋతు చక్రంలో అసాధారణ మార్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. నొప్పి తీవ్రత, వ్యవధి, రక్తస్త్రావంలో మార్పులను గమనించాలి. ఈ పరిస్థితి గర్భాశయంపై పెను ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. పెల్వి్ ఇన్ఫెక్షన్లు, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల వంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీయొచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురైతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తం.

5. చర్మంలో మార్పులు: మీ చర్మంలో ఆకస్మిక మార్పులను గమనించండి. చంకలలో, మెడ వెనుక చర్మం నల్లగా మారడం, అనేక స్కిన్ ట్యాగ్‌లు ప్రిడయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. క్రస్టీ, పొలుసుల పెరుగుదల ఆక్టినిక్, సోలార్ కెరాటోసిస్ వంటి ముందస్తు పరిస్థితి కావచ్చు. ఇప్పటికే ఉన్న పుట్టుమచ్చల పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పులు వచ్చిన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

6. బరువులో ఆకస్మిక మార్పులు: నిర్దిష్ట ప్రయత్నం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గినట్లయితే అది అనారోగ్య సమస్యలకే సంకేతమని చెప్పాలి. సాధారణ కారణాలు థైరాయిడ్, మధుమేహం, మానసిక రుగ్మతలు, కాలేయ వ్యాధి లేదా క్యాన్సర్ వంటి వాటి కారణంగా బరువులో ఆకస్మిక మార్పులు ఉంటాయి. అలాగే ఆకస్మికంగా బరువు పెరిగితే.. అది థైరాయిడ్, డిప్రెషన్, ఇతర జీవక్రియ వ్యాధులను సూచించవచ్చు.

7. రొమ్ములో అసాధారణ మార్పులు: ఛాతిలో గడ్డలు, రొమ్ము చర్మంలో మార్పులు, చనుమొన రూపంలో మార్పులు వచ్చినట్లయితే.. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇవి రొమ్ము క్యాన్సర్‌కు ప్రమాదం కావొచ్చు.

8. గురక, అధిక మగత: మీరు కూర్చున్న చోటే నిద్రపోతున్నట్లయితే, అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల కావచ్చు అని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే పడుకున్న తరువాత గురక వస్తున్నట్లయితే.. అది హృదయ సంబంధిత సమస్యలకు, బరువు పెరగడానికి దారితీయొచ్చు.

9. అధిక అలసట : అలసిపోవడానికి అనేక కారణాలున్నాయి. అయినప్పటికీ, ఎక్కువ అలసటగా అనిపిస్తే.. అంతర్లీన జీవక్రియ సమస్యలు, క్యాన్సర్, చిత్తవైకల్యం, పార్కిన్సన్స్ వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితులను సూచిస్తుంది.

10. దృష్టిలో అసాధారణ మార్పులు: వయస్సుతో పాటు వ్యక్తుల దృష్టి మసకబారుతుంది. కానీ అకస్మాత్తుగా మీ కళ్లు అస్పష్టంగా కనిపించడం, చూడటంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు ఎదురైతే.. అది స్ట్రోక్‌కి సంకేతం కావొచ్చు. అలాగే.. కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురైతే.. వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

11. అధిక మానసిక ఒత్తిడి, ఆందోళనలు: ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్య కారణంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి స్థాయి సాధారణానికి మించి అధికంగా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇది మానసికంగా ఆరోగ్యాన్ని మరింత కుంగదీస్తుంది.

ముగింపు: ఈ లక్షణాలే కాదు.. మీ శరీరంలో ఎలాంటి తీవ్రమైన లోపాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స పొందడం ఉత్తమమైన మార్గం. ఇలా చేయడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.

Also read:

Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!

UP Elections BJP – MIM: ఎస్పీని ఘోరంగా దెబ్బతీసిన ఎంఐఎం.. బీజేపీకి రూట్ క్లియర్ చేసిందనే టాక్..!

Adulterated Milk: మీరు పాలు కొనుగోలు చేస్తున్నారా?.. అయితే ఒక్కసారి ఈ వార్త చూడండి..!