Meat: ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే. మటన్ లేదా చికెన్ లాగించేయాల్సిందే.. వాస్తవానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి కొన్ని పోషకాలు లభిస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. మాంసం పరిమితంగా తినడం వల్ల శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా కానీ అతిగా తింటే నష్టమే కానీ లాభం ఉండదు. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వ్యాధుల నిలయంగా మారుతుంది. మాంసాహారం వల్లే ఎక్కువ మంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసం కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. ఒకానొక సమయంలో గుండెపోటు లాంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే మాంసం తినడం మానేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. కొలెస్ట్రాల్
మాంసాహారం ఎక్కువగా తినేవారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాంసాహారం మానేస్తే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అంతేకాదు గుండె జబ్బులు మీకు దూరంగా ఉంటాయి.
2. బరువు
మాంసాహారాన్ని తప్పుడు పద్ధతిలో తీసుకుంటే బరువు పెరుగుతారని పలు పరిశోధనలో వెల్లడైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మాంసం తినడం మానేసిన వ్యక్తులు బరువు తగ్గడం సులభం. బదులుగా మీరు మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని పోషకాల కొరతను తీరుస్తాయి. అంతేకాదు బరువుని కూడా తగ్గిస్తాయి.
3. పేగుల పనితీరుపై ప్రభావం
మాంసం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు పేగుల పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం చాలా ప్రమాదం. దీని వల్ల పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తాయి. ఈ పరిస్థితిలో మాంసం తినడం మానేసి మొక్కల ఆధారిత ఆహారాన్ని డైట్‌లో భాగంగా చేసుకోండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా చేయడం వల్ల పేగులు శుభ్రపడతాయి. వాటి సామర్థ్యం కూడా పెరుగుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.