Headphones: హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే, మీకే ఈ వార్నింగ్..!

|

Jul 07, 2022 | 8:52 PM

Headphones: ప్రస్తుత టెక్ యుగంలో చాలా మంది ప్రజలు హెడ్‌ఫోన్స్ అధికంగా వినియోగిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది హెడ్ ఫోన్స్‌..

Headphones: హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే, మీకే ఈ వార్నింగ్..!
Head Phones
Follow us on

Headphones: ప్రస్తుత టెక్ యుగంలో చాలా మంది ప్రజలు హెడ్‌ఫోన్స్ అధికంగా వినియోగిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది హెడ్ ఫోన్స్‌ కూడా మరింత స్మార్ట్‌గా వస్తున్నాయి. ఇయర్‌బర్డ్స్, వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ మార్కె్ట్‌లోకి విరివిగా వస్తున్నాయి. ప్రజలు ట్రావెలింగ్‌లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ అధిక వినియోగం వల్ల వినికిడి లోపం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయట. తాజాగా ఫ్రాన్స్‌లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. చాలా మంది పరిశోధకులు, నిపుణులు సైతం ఇంతకు ముందు ఇలాంటి వాదనలు చేశారు. ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్ వినియోగం వల్లే ఏం జరుగుతుంది? నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా అధ్యయనం ఏం చెబుతోంది?
ఫ్రాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ (INSERM) ఇటీవలి ఓ అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. ఫ్రాన్స్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు హెడ్‌ఫోన్‌ల కారణంగా వినికిడి లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫ్రాన్స్‌లో 25% మంది పెద్దలు వినికిడి సమస్యలతో బాధపడుతున్నారని ఆ అధ్యయనం చెబుతోంది. హెడ్‌ఫోన్స్ ఎక్కువగా వాడడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇది కాకుండా, మారుతున్న జీవనశైలి, ఒంటరితనం, డిప్రెషన్ కూడా చెవిటితనానికి కారణమవుతున్నాయి. ఈ అధ్యయనంలో 18 నుంచి 75 ఏళ్ల వయస్సు గల 1.86 లక్షల మంది పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల మంది ప్రజలు వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?
ENT స్పెషలిస్ట్ డాక్టర్ శరద్ మోహన్(ఎంఎస్) మాట్లాడుతూ.. హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లతో 85డిబి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో సంగీతం వినడం వల్ల శబ్దం-ప్రేరిత వినికిడి నష్టం (ఎన్‌ఐహెచ్‌ఎల్) ఏర్పడుతుందన్నారు. అంతే కాకుండా ఎక్కువసేపు బిగ్గరగా ఉండడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని తెలిపారు. ఈ సమస్యను పట్టించుకోకుండా అజాగ్రత్తగా ఉన్నవారు చెవిటివారిగా మారవచ్చని పేర్కొన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని సూచించారు.

ఈ సమస్యను ఎలా నివారించాలి?
డాక్టర్ శరద్ మోహన్ ప్రకారం.. శబ్దం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని పూర్తిగా నివారించవచ్చు. అవసరమైన మేరకు/వీలైనంత తక్కువగా హెడ్‌ఫోన్స్ ఉపయోగించాలి. ఎలాంటి శబ్దం వల్ల ఇబ్బంది కలుగుతుందో గ్రహించాలి. సంగీతం వింటున్నప్పుడు వాల్యూమ్ తక్కువగా పెట్టుకోవాలి. శబ్దాన్ని తగ్గించలేకపోతే.. దానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..