Monsoon Hair Care Tips: వర్షాకాలంలో చర్మ ఇన్ఫెక్షన్లతో పాటు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. ఈ సీజన్‌లో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల రకరకాల జుట్టు సమస్యలు తలెత్తుతాయి. ఆయిలీ స్కాల్ప్, జిడ్డు జుట్టు, విస్తృతమైన చుండ్రు అలాగే దురద అనిపిస్తుంది. ఇది జుట్టు మూలాలను దెబ్బ తీస్తుంది. ఫలితంగా, జుట్టు రాలడం (హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్) వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. అయితే, ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో చికిత్స చేయకపోతే.. తలపై నల్ల మచ్చలతో పాటు.. జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో సాధారణంగానే 150 రెట్లు జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరి వర్షాకాలంలో జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతులు, నిమ్మరసంతో హెయిర్ మాస్క్..
మెంతులు చుండ్రును తొలగిస్తాయి. అలాగే అలర్జీ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. నిమ్మకాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది తలపై పేరుకునే సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా పని చేస్తుంది. జుట్టును సంరక్షిస్తుంది. మెంతి గింజల పొడిలో తాజా నిమ్మరసం వేసి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్‌ని తల మొత్తానికి పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత హెర్బల్ షాంపూతో జుట్టును క్లీన్ చేయాలి.
హెన్నా, ఆవాల నూనె..
హెర్బల్ హెన్నా జుట్టు మెరిసే, సహజ రంగును సంరక్షించడమే కాకుండా.. జుట్టును కూడా రక్షిస్తుంది. హెన్నా ఆకులకు జుట్టును బలపరిచే గుణం ఉంది. ఇది స్కాల్ఫ్ ఫోలికల్స్‌లోకి పోషకాలు చొచ్చుకకుపోవడాన్ని సులభతరం చేస్తుంది. జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఒక కప్పు హెన్నా ఆకులను తీసుకోవాలి. 250 ఎంఎల్ మరిగే ఆవాల నూనె కలపాలి. నూనె రంగు మారగానే.. దానిని చల్లార్చాలి. ఆ తర్వాత వడకట్టి నూనెను తలకు పట్టించాలి. అరగంట సేపు అలాగే ఉంచి.. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టును క్లీన్ చేసుకోవాలి.
వేప, పసుపు పేస్ట్..
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఈ హెయిర్ మాస్క్‌లో యాంటీమైక్రోబయల్‌గా కూడా పనిచేస్తుంది. వేప, పసుపు పొడితో తయారు చేసే ఈ పేస్ట్ జుట్టు రక్షణలో అద్భుతంగా పని చేస్తుంది. ఇది క్రిములతో పోరాడటంలో, చుండ్రు, దురద, వాపు వంటి సమస్యలను నివారిస్తుంది.
ఈ పేస్ట్ చేయడానికి ముందుగా తాజా వేప ఆకులు, పసుపు పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలపై సున్నితంగా మసాజ్ చేసి 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తేలికపాటి షాంపూతో కడిగిన తర్వాత కండీషనర్ అప్లై చేయాలి.
పెరుగు, కలబంద..
అలోవెరా జెల్ చికాకు, దురద సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు పూత లాక్టిక్ యాసిడ్ లక్షణాలు వాటిని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. ఈ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు మూలాల్లోని మృతకణాలు, ధూళి, ఇతర వ్యర్థాలు తొలగిపోతాయి. ఇది తల, జుట్టు మెరుపును పెంచుతుంది.
ముందుగా ఒక టేబుల్‌స్పూన్ తాజా కలబంద జెల్‌ను అవసరమైన మొత్తంలో పెరుగుతో కలిపి పేస్ట్ చేయాలి. తర్వాత ఆ పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయాలి. అది ఆరిపోయే వరకు ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో తలను శుభ్రంగా కడగాలి.