
అల్లంలో ఉండే జింజెరాల్ అనే ముఖ్యమైన సమ్మేళనం శరీరంలో వాపులు, నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరచడమే కాదు.. వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తరిగిన అల్లం లేదా అల్లం నీరు తాగడం శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీబాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంలో, రక్తపోటు నియంత్రణలో ముఖ్యంగా పనిచేస్తుంది. అంతేకాక వైరల్ ఇన్ ఫెక్షన్లను అడ్డుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది.
అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం వల్ల వాటి ఆరోగ్య లాభాలు మరింతగా పెరుగుతాయి. వీటిలోని సమ్మేళనాలు కలిసి పని చేసి శరీరంపై మరింత శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి. దీనిని సినర్జీ ఎఫెక్ట్ అంటారు.. అంటే ఒక్కో పదార్థం వేర్వేరుగా ఇచ్చే లాభాల కంటే కలిపి వాడినప్పుడు వచ్చే లాభం ఎక్కువగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం వల్ల కలిగే లాభాలు.
వంటల్లో అన్ని రకాల కూరలకు అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తరిగిన అల్లం, వెల్లుల్లిని తేనెతో కలిపి తినడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే అల్లం టీ లేదా వెల్లుల్లి నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అల్లం, వెల్లుల్లి మోతాదుకు మించకుండా వాడాలి. శరీర తత్వాన్ని బట్టి కొందరికి ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. గర్భిణులు, రక్తం పల్చబడే మందులు వాడే వారు వైద్య సలహాతో వాడితే మంచిది. అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం ఆరోగ్యానికి హానికరం అనే అపోహను వదిలేయండి. నిజానికి వీటిని సరిగ్గా వాడితే ఆరోగ్య లాభాలు మరింతగా లభిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)