ఉరుకుల పరుగుల కాలానికి అనుగుణంగా రేసులో ముందుండాలన్న లక్ష్యంతో ఈ మధ్యకాలంలో యువత నిద్రాహారాలను సైతం విస్మరిస్తున్నారు. పని ఒత్తిడి, ఆర్ధిక కష్టాలు ఇలా కారణాలు ఎన్నో ఉన్నాయి. యువత సరైన సమయానికి తగినంత పోషకారాన్ని తీసుకోవడం మర్చిపోతున్నారు. తద్వారా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రతీ సంవత్సరం అత్యధిక సంఖ్యలో గుండె సంబంధిత వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. గుండె పనితీరు సరిగ్గా ఉండాలంటే.. సమయానికి తినడంతో పాటు అధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సాధారణంగా గుండెపోటు లక్షణాలంటే ఛాతీ మధ్యలో నుంచి ఎడమ వైపు నొప్పి ఉంటుంది. అంతేకాకుండా అక్కడంతా బరువు ఎక్కిన్నట్లుగా అనిపిస్తుంది. అయితే తాజాగా ఈ తొమ్మిది లక్షణాలు.. గుండెపోటు రావడానికి సంకేతాలని వైద్య నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి..
సాధారణంగా గ్యాస్ లేదా ఎసిడిటీ కారణంగా ఛాతీలో నొప్పి వస్తుంటుంది. అయితే అన్ని వేళలా అదే కారణం అని దాన్ని విస్మరించవద్దు. ఛాతీలో నొప్పి వచ్చినా, అక్కడ భారంగా అనిపించినా.. అది ఖచ్చితంగా గుండెపోటుకు సంకేతమే. అలాగే ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్తం గుండె వరకు చేరదు. అలాంటి సమయంలో కూడా ఛాతీ నొప్పి రావొచ్చు. ఈ లక్షణాలను విస్మరించవద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
గుండెపోటు శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావితం చేస్తుంది. ఛాతీ నొప్పి ఒక్కటే గుండెపోటుకు సంకేతం కాదు.. గొంతు లేదా దవడ భాగాలలో మీకు నొప్పి కలిగి అసౌకర్యం అనిపించినా అది గుండెపోటుకు సంకేతమే.
సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు గానీ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మనకు చెమటలు పడతాయి. అయితే ఇలాంటివి ఏవి కూడా చేయనప్పుడు చెమటలు పడితే.. అది అనారోగ్య సమస్యకు సంకేతం. గుండెకు రక్తం సరిగ్గా సరఫరా జరగనప్పుడు చెమటలు పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే.. తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.
మీకు మైకం కమ్మినట్లు అనిపించినా.. లేదా కళ్లు తరచూ మసకబారుతున్నా.. ఆ లక్షణాలు లో-బీపీకి సంకేతాలు. ఈ సమస్యలు మీలో కనిపించినట్లయితే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. శరీరంలోని రక్త సరఫరాను లో-బీపీ తగ్గిస్తుంది. అందువల్ల గుండెకు సరిగ్గా రక్తం చేరదు. దీనితో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగవచ్చు.
వికారం ఆ తర్వాత వాంతులు గుండెపోటుకు కొన్ని లక్షణాలు. అలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
పాదాలు, చీలమండలు, అరికాళ్లలో వాపు ఉంటే.. గుండెపోటుతో సంబంధం ఉన్నట్లే.. చాలాసార్లు గుండెల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు పాదాలలో వాపు, చీలమండలు, అరికాళ్లలో వాపులు ఉంటాయి.
ఈ రోజుల్లో అధిక రక్తపోటు సమస్య ప్రజలలో సర్వసాధారణమైపోయింది. అయితే ఈ వ్యాధి తీవ్రత 50 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా రక్తపోటును పరిశీలించండి. అనియంత్రిత అధిక రక్తపోటు మీ గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలా ఉంటే.. డాక్టర్‌ను సంప్రదించండి. ఈ లక్షణాలే కాకుండా హైపర్ గ్లైసేమియా(High Blood Sugar), హైపర్ కొలెస్ట్రాలేమియా(High Cholesterol) కూడా లాంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలు. ఇలాంటివి మీలో కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి. వారి సలహాలను పాటించండి.