AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగురంగుల కూరగాయలు, పండ్ల వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటో తెలుసా?

రంగురంగుల పండ్లు, కూరగాయలను చూడగానే తినాలనిపిస్తుంది కదా! అయితే వీటిలో కేవలం రుచి మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు వంటి వివిధ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు శరీరానికి ఏ రకమైన పోషకాలను అందిస్తాయి? ఈ 'ఈట్ ది రెయిన్‌బో' సూత్రం మనల్ని క్యాన్సర్, గుండె జబ్బుల నుండి ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం.

రంగురంగుల కూరగాయలు, పండ్ల వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటో తెలుసా?
Colorful Fruits And Vegetables.jpg
Nikhil
|

Updated on: Jun 03, 2026 | 7:21 PM

Share

ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కూరగాయలు రంగురంగుల్లో ఉండటం వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంది. పండ్లు, కూరగాయలు రంగుల్లో కనిపించడానికి కారణం వాటిలో ఉండే ‘ఫైటోన్యూట్రియెంట్లు’. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, కంటి సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారంలో రంగులు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రంగును బట్టి వాటిలోని పోషకాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

  • ఎరుపు: టమాటా, దానిమ్మ వంటి ఎరుపు రంగు పండ్లు, కూరగాయల్లో లైకోపిన్, ఆంథోసైనిన్ అనే ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
  • ఆకుపచ్చ: ఆకుకూరలు, కూరగాయల్లో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని ‘క్యాటెచిన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, ఇవి శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
  • నీలం, పర్పుల్: ఈ రంగు పండ్లలో ఆంథోసైనిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బలోపేతం చేయడమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
  • పసుపు, ఆరెంజ్: క్యారెట్, నిమ్మ, నారింజ వంటి వాటిలో బీటా కెరోటిన్, కర్క్యుమినాయిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు, గోళ్లు, కండరాలను బలంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి పెరుగుతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
  • తెలుపు, గోధుమ: వెల్లుల్లి, పుట్టగొడుగులు వంటి వాటిలో ఉండే అల్లిసిన్ అనే సల్ఫోరైడ్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. అంతేకాకుండా, రక్తపోటు (బీపీ), కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పిల్లలకు రంగురంగుల కూరగాయలను రుచికరంగా వండి పెట్టడం ద్వారా వారు ఆసక్తిగా తింటారు. పైన పేర్కొన్న ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనం దాగి ఉంది. కాబట్టి, మన ఆహారంలో కేవలం రుచిని మాత్రమే కాకుండా, రంగులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. “ఈట్ ది రెయిన్‌బో” అనే సూత్రాన్ని పాటిస్తూ, ప్రతిరోజూ వివిధ రంగుల పండ్లు, కూరగాయలను తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. చిన్న చిన్న ఆహారపు మార్పులే దీర్ఘకాలంలో మనల్ని ఆరోగ్యవంతులుగా నిలబెడతాయి. కాబట్టి, నేటి నుంచే మీ ప్లేట్‌లో రంగులను ఆహ్వానించండి!

Follow Us