
శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. రక్తంలోని వ్యర్థాలను వడపోసి, శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడతాయి. అయితే, కొన్నిసార్లు కిడ్నీ సమస్యలు ప్రారంభమైనా, లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు. సకాలంలో ఈ లక్షణాలను గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. నెఫ్రాలజిస్ట్‌లు.. కిడ్నీ సమస్యలను ఎలా గుర్తించాలో వివరిస్తున్నారు.
కిడ్నీ వ్యాధి సాధారణ లక్షణాలు:
యూరినరీ సమస్యలు: సాధారణం కంటే ఎక్కువ సార్లు యూరిన్‌కు వెళ్ళవలసి రావడం లేదా యూరిన్ అవుట్‌పుట్ గణనీయంగా తగ్గిపోవడం. యూరిన్‌లో రక్తం కనిపించడం, లేదా నురుగు రావడం కూడా ఒక సంకేతం.
కాళ్ళ వాపులు: కాళ్ళలో వాపు రావడం. ముఖం, ప్రత్యేకించి కళ్ళ చుట్టూ వాపు (ఫేషియల్ పఫీనెస్) కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం.
అదుపులేని రక్తపోటు (హైపర్‌టెన్షన్): రక్తపోటు నియంత్రణలో లేకపోవడం, తరచుగా తలనొప్పి, ఛాతీ నొప్పి లేదా బీపీ పెరిగి ఆయాసం రావడం జరగవచ్చు.
ఆయాసం: రక్తహీనత లేదా గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల ఆయాసం కలగవచ్చు.
కిడ్నీ ఫెయిల్యూర్ రకాలు, వాటి లక్షణాలు:
కిడ్నీ ఫెయిల్యూర్‌ను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.
1.అక్యూట్ కిడ్నీ ఇంజూరీ (AKI) / అక్యూట్ కిడ్నీ డిసీజ్: ఇది తాత్కాలిక సమస్య. కొన్ని గంటలు లేదా రోజుల్లో యూరిన్ ఉత్పత్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. ఈ దశలో రక్తపోటు పెరగడం లేదా యూరిన్‌లో రక్తం, నురుగు కనిపించవచ్చు. ఈ సమస్యను త్వరగా గుర్తించి చికిత్స చేయకపోతే, అది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్)గా మారే అవకాశం ఉంది.
2. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) / క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్: ఈ దశలో లక్షణాలు మరింత స్పష్టంగా ఉంటాయి. అదుపులేని రక్తపోటు, తరచుగా తలనొప్పి, రక్తహీనత (అనీమియా) కారణంగా రక్త స్థాయిలు తగ్గి ఆయాసం రావడం, గుండె బలహీనపడటం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొందరిలో, వారి రోజువారీ పనులలో అలసట, బలహీనత వంటివి కూడా ఈ సమస్యను సూచిస్తాయి. కండరాల తిమ్మిర్లు (ముఖ్యంగా రాత్రిపూట), వెన్ను నొప్పి మరియు ఎముకలలో మార్పులు కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ లక్షణాలుగా గుర్తించవచ్చు. గుండె బలహీనమైనప్పుడు వచ్చే లక్షణాలు, కిడ్నీలు బలహీనమైనప్పుడు కూడా కనిపిస్తాయి.
నెఫ్రాటిక్ సిండ్రోమ్:కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతినడం వల్ల ప్రోటీన్ శరీరంలోంచి బయటకు పోవడం వల్ల నెఫ్రాటిక్ సిండ్రోమ్ వస్తుంది. ఇది పిల్లలలో కూడా తరచుగా కనిపిస్తుంది. శరీరంలో అకస్మాత్తుగా వాపు రావడం (ముఖ్యంగా ముఖం, చేతులు, కాళ్ళు), దీని ప్రధాన లక్షణం. ఈ సందర్భంలో యూరిన్ అవుట్‌పుట్ సాధారణంగా ఉండవచ్చు, లేదా తరువాత తగ్గవచ్చు. పైన పేర్కొన్న ఏ లక్షణాలు కనిపించినా, వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించడం అత్యవసరం. సకాలంలో వైద్యుడిని సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన చికిత్స పొంది తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు.
(ఇది నిపుణులు నుంచి సేకరించిన సమాచారం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా.. వైద్య నిపుణులను సంప్రదించండి)