మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు లక్షల రూపాయల ఖర్చు చేయనవసరం లేకుండా కొన్ని రకాల విషయాలను తెలుసుకుంటే సరిపోతుంది. అందులో భాగంగానే మన చుట్టూ ఉండే మొక్కలు, చెట్లు వాటి ఆకులు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలపై కూడా అవగాహన కలిగి ఉండాలి. కొంతలో కొంత మేర అవగాహనను సంపాదించుకున్న అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. మన పూర్వీకులు ఆయుర్వేద వైద్యం కోసం ఈ మొక్కల ఆకులను, వేర్లనే వాడేవారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అటువంటి ఉపయోగకరమైన చెట్ల ఆకుల జాబితాలో మునగాకు కూడా ఉంది. అద్బుతమైన పోషక విలువలతో పాటు అమోఘమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న మునగాకు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వంటలకు ఘుమఘుమలను అందించడంతో పాటు ఆరోగ్యాన్ని మేలు చేయడంలో కూడా మునగాకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మునక్కాయలతో చారు, సాంబార్, కూర, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలనే కాకుండా లేత మునగాకును, మునగ చెట్టు పూలను కూడా కూరగా చేసుకుని తినడం వల్ల మనం మరింత చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మునగాకు వెగటు, కారం రుచులను కలిగి ఉంటుంది. అలవాటు చేసుకుంటే మునగాకు కూడా చాలా రుచిగా ఉంటుంది. మునగాకు కాలేయంలో చేరిన మలినాలను తొలగిస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది.
గృహ వైద్యంలో మునగాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. 100 గ్రాముల మునగాకులో 13.4 గ్రాముల పిండి పదార్థాలు, 1.7గ్రాముల కొవ్వు పదార్థాలు, 6.7 గ్రాముల మాంసకృత్తులు, 440 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 7 మిల్లీ గ్రాముల ఐరన్, 0.9 మిల్లీ గ్రాముల పీచు పదార్థాలు, 200 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 2.3 శాతం ఖనిజ లవణాలు, 97 క్యాలరీల శక్తి ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలను నయం చేసే దివ్యౌషధంగా ఈ మునగాకు మనకు ఉపయోగపడుతుంది. పొట్టలో వచ్చే ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో మునగాకు మనకు దోహదపడుతుంది. మునగాకుతో పప్పు, మునగాకు ఇగురు, ఇతర వంటకాల్లో మునగాకును ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.
మునగాకును ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో గ్లాస్ పాలల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఈ పొడిని వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వారు మునగాకును మెత్తగా నూరి నొప్పుల ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి నొప్పులైనా తగ్గుతాయి. అలాగే మునగాకును నూరి లేపనంగా రాయడం వల్ల చర్మ సమస్యలు, వ్రణాలు కూడా తగ్గుతాయి. మునగాకు రసాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు రేచీకటి సమస్య కూడా తగ్గుతుంది. మునగాకు రసాన్ని కీర దోస రసంతో కలిపి తీసుకోవడం వల్ల గుండె, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. మునగాకు రసాన్ని తాగడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మునగాకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల లేదా ఆకులతో చేసిన రసాన్ని తాగడం వల్ల, మునగాకు కషాయాన్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
బీపీ కూడా అదుపులో ఉంటుంది. మునగాకును తీసుకోవడం వల్ల లైంగిక వాంఛ పెరుగుతుంది. పురుషుల్లో వచ్చే నపుంసకత్వం సమస్య తగ్గుతుంది. మునగాకు రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎముకలు ధృడంగా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ఈ మునగాకును తీసుకోవచ్చు. మునగాకు కషాయంలో మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. ఒక టీ స్పూన్ మునగాకు రసాన్ని ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లల్లో కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి. నిమ్మరసాన్ని, మునగాకు రసాన్ని కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చులు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా మునగాకు మనకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.