ఈ మధ్యకాలంలో యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బరువు తగ్గేందుకు, అదుపులో ఉంచుకునేందుకు పలు పోషకాహారాలను తీసుకుంటున్నారు. ఆ కోవలోనే కొందరు బరువును నియంత్రించేందుకు కొందరు గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటమే కాదు.. పోషక విలువలు కూడా ఎక్కువే. సహజసిద్దమైన గ్రీన్ టీ.. రోగ నిరోధకశక్తిని పెంచడమే కాదు.. మెటబాలిజం పెరగడంలో సహాయపడుతుంది. అటు మెదడు కూడా చురుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. మరి ఇంతటి పోషకాల నిధిని ఎప్పుడెప్పుడు తాగాలన్న విషయం చాలామందికి తెలియదు. కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటే.. మరికొందరు భోజనం చేశాక.. ఇంకొందరు రాత్రి వేళల్లో గ్రీన్ టీ తాగుతుంటారు. మరి గ్రీన్ టీ ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని.. దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
అసలు గ్రీన్ టీ తాగేందుకు సరైన సమయం ఏది.? ఎక్సర్‌సైజులు చేసిన తర్వాత.. ఉదయం 11-12 గంటల మధ్య తీసుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు.. సాయంత్రం అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక గంటకు.. అటు రాత్రి పదుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.