M-Meme: అశాంతి రోగానికి… డా.ప్రసాద్ మీమ్ సర్జరీ!
సోషల్ మీడియాలో మనం చూసి నవ్వుకునే మీమ్స్ గురించి మనందరికీ తెలుసు. అయితే.. ఈ పుస్తకం టైటిల్ అర్థం మాత్రం అది కానేకాదు. రచయిత ఇక్కడ సైన్స్ మాట్లాడుతున్నారు. ఎలాగైతే మనిషి జన్యువు.. అతని శరీర రంగును, రూపాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి మోసుకెళ్తుందో.. ఒక ఆలోచనను, ఒక నమ్మకాన్ని ఒక మెదడు నుంచి మరో మెదడుకు చేరవేసే ‘ఆలోచనా జన్యువు’ పేరే మీమ్.

లోకంలో జరుగుతున్న యుద్ధాలన్నీ భూమి కోసమో, బువ్వ కోసమో, పెత్తనం కోసమో అని మనమంతా అనుకుంటూ ఉంటాం. లోకం ఎటు వెళ్తోంది? అని అడిగితే.. అంగారక గ్రహాన్ని కూడా అధిగమిస్తోంది.. అని గర్వంగా చెప్పుకొని మన మేధస్సుకు మురిసిపోతుంటాం. కానీ.. మనుషులుగా మాత్రం రోజూ.. ఇతరులను ఇబ్బంది పెట్టే పనులే చేస్తుంటాం. యుద్ధాలు, కులమతాల కుమ్ములాటలు, ‘మనం-వారు’ అనే విభజన రేఖలు..ఇవన్నీ ఎక్కడో సరిహద్దుల్లోనో, కొందరు దుర్మార్గుల కుట్రల పరిణామాలని బలంగా నమ్ముతూ ఉంటాం. కానీ, ఆ విభజన రేఖలన్నీ.. మన ఆరు అంగుళాల మెదడులోనే ఉన్నాయని మాత్రం గుర్తించలేకపోతున్నాం! సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకుని.. ‘M-Meme’ అనే పుస్తకం రాశారు డాక్టర్ ప్రసాద్ మల్లిపూడి. డా.ప్రసాద్ మల్లిపూడి యూకేలో సర్జికల్ ట్రైనింగ్, 1994లో FRCS పూర్తి చేశారు. 2004లో భారత్ వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో లాప్రోస్కోపీ సర్జన్‌గా సేవలందిస్తున్నారు. ఆ పుస్తకాన్ని చదువుతుంటే, సమాజానికి పట్టిన రోగానికి మూలకారణాన్ని ఒక సర్జన్ లాగా ఆయన విశ్లేషించిన తీరు అద్భుతం అనిపించింది.
సోషల్ మీడియాలో మనం చూసి నవ్వుకునే మీమ్స్ గురించి మనందరికీ తెలుసు. అయితే.. ఈ పుస్తకం టైటిల్ అర్థం మాత్రం అది కానేకాదు. రచయిత ఇక్కడ సైన్స్ మాట్లాడుతున్నారు. ఎలాగైతే మనిషి జన్యువు.. అతని శరీర రంగును, రూపాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి మోసుకెళ్తుందో.. ఒక ఆలోచనను, ఒక నమ్మకాన్ని ఒక మెదడు నుంచి మరో మెదడుకు చేరవేసే ‘ఆలోచనా జన్యువు’ పేరే మీమ్. ఒక వ్యక్తి చెప్పిన అబద్ధమో, అహంకారమో, ద్వేషమో మన మెదడులోకి చేరి అక్కడ కాపురం పెడితే.. అది ఒక వైరస్‌లా మారిపోతుంది. అది మనల్ని ఆడించడం మొదలుపెడుతుంది. రచయిత ఈ పుస్తకంలో ‘కాన్‌ఫ్టిక్ట్ మీమ్స్’అనే ఆసక్తికరమైన, ప్రమాదకరమైన అంశాల గురించి చెప్పారు.‘నా మతమే గొప్పది, నా కులమే శ్రేష్ఠమైనది, నా ఆలోచలనే మేలైనవి. మిగిలినవన్నీ నాకు నష్టం చేసేవి.. పనికి రానివి’ వంటి భావనలు మానసిక కేన్సర్ వంటివే అంటారు రచయిత. ఈ రోజుల్లో ఇలాంటి వాటిని బాల్యంలోనే పసి పిల్లల మెదడుల్లోకి ఎక్కించేస్తున్నారు. ఫలితంగా వాడు పెరిగి పెద్దయ్యాక తోటి వారిని ప్రేమించడం మానేసి, తనలో ఉన్న ఆ ‘విషపూరిత మీమ్’ నిజమని నిరూపించటం కోసం పెద్ద యుద్ధమే చేసి.. తన చుట్టూ ఉన్నవారిని అశాంతికి గురి చేస్తాడు. ఇక్కడ నిజానికి శత్రువు.. ఆ వ్యక్తి అనుకుంటున్నట్లుగా మరెవరో కాదు.. అతని మెదడులో చొరబడిన ఆ తప్పుడు ఆలోచనే!
ఈ పుస్తకంలో డాక్టర్ ప్రసాద్ కేవలం రోగాన్ని, రోగ లక్షణాలను మాత్రమే చెప్పి.. అంతటితో ఊరుకోలేదు. దానికి బ్రహ్మాండమైన మందు కూడా ఇచ్చారు. అదే ‘M-Meme’ ఫ్రేమ్‌వర్క్. ఇందులో భాగంగా ఆయన డీకోడింగ్ అనే పద్ధతి గురించి చెప్పారు. అంటే.. మొదట మన మెదడులో ఏ ఏ పిచ్చి ఆలోచనలు ఉన్నాయో గుర్తించి, వాటిని మనమే విశ్లేషించుకోవాలి. డీకోడింగ్ తర్వాత న్యూట్రలైజేషన్ జరగాలి. అంటే.. మన మనసులోని తప్పుడు ఆలోచన స్థానంలో ఒక తార్కికమైన, శాంతియుతమైన ఆలోచనను నింపాలి. చివరగా.. మానవత్వం, కరుణ అనే యూనివర్స్ మీమ్స్‌ను బాగా ‘వైరల్’ చేయాలి. ద్వేషం కంటే ప్రేమ వేగంగా పాకాలి. అయితే, ఈ సిద్ధాంతాన్ని ప్రపంచ స్థాయిలో అమలు చేయడం కొంచెం కష్టమే కావచ్చు, దానికి బోలెడంత సమయం కూడా పట్టొచ్చేమో గానీ.. అసాధ్యం మాత్రం కాదంటారు రచయిత.
చివరగా..డా. ప్రసాద్ ‘M-Meme’.. కేవలం ఒక పుస్తకం కాదు. అశాంతితో రగులుతున్న ఈ సమాజానికి ఒక మేనిఫెస్టోను నిర్దేశించి, దానికో రూట్ మ్యాప్ కూడా ఇచ్చే పరిశోధన. మన మెదడును మనమే ఎలా ‘రీ-ప్రోగ్రామ్’ చేసుకోవాలో గైడ్ చేసే దారిదీపం. ప్రపంచాన్ని మార్చడటమంటే.. మనల్ని మనం మార్చుకోవడమేననే సత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే గొప్ప బోధకుడిలాంటిది. ఒక డాక్టర్‌గా కేవలం శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించే సులభమైన పద్ధతులను ఈ పుస్తకంలో అందించి.. విశ్వమానవులుగా మనల్ని మనం తీర్చుదిద్దుకునే అవకాశాన్ని రచయిత కల్పించారు. ప్రపంచంలోని ప్రతి మనిషికీ కనెక్ట్ అయ్యే ఇంత మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతిని మిగిల్చినందుకు డాక్టర్ ప్రసాద్ కి కృతజ్ఞతలు. అమెజాన్‌లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది.
(శివరామకృష్ణ గోరంట్ల)
