Health Tips: మీ చర్మమే డాక్టర్.. ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

జాగ్రత్త.. మీ శరీరంలో రోగం వస్తుందని ఈ 4 సంకేతాలు ముందే చెబుతున్నాయి.. మెడ నల్లబడటం, కళ్ల చుట్టూ పసుపు మచ్చలు.. ఇవి కేవలం చర్మ సమస్యలు కాదు. ఇవి డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి పెద్ద రోగాల తొలి హెచ్చరికలు కావచ్చు..ఈ ముఖ్యమైన సంకేతాలు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: మీ చర్మమే డాక్టర్.. ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..
Dont Ignore These 4 Body Signs

Updated on: Oct 26, 2025 | 6:24 PM

నేటి ఆధునిక జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరిగింది. ఈ వ్యాధులు చాలా వరకు లోపల అభివృద్ధి చెందుతున్నా, వాటి లక్షణాలు తీవ్రమయ్యే వరకు బయటపడవు. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. వ్యాధులను గుర్తించడానికి ప్రతిసారీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరం ముఖ్యంగా చర్మం, కళ్ళు, పెదవులు ఇచ్చే కొన్ని సంకేతాలను గమనించడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. శరీరంలో అభివృద్ధి చెందుతున్న అనేక వ్యాధుల ప్రారంభ ప్రభావాలు చర్మంపై కనిపిస్తాయి. చర్మంపై మార్పులు చాలా కాలం పాటు కొనసాగితే వాటిని విస్మరించకూడదు.

4 ముఖ్య సంకేతాలు :

 మెడపై నల్లదనం లేదా చారలు

మీ మెడ లేదా చంకల చుట్టూ నల్లటి మచ్చలు లేదా చారలు గమనించారా..? దీనిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇది డయాబెటిస్ లేదా పీసీఓఎస్ యొక్క ప్రారంభ సంకేతం కావచ్చు. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం.. ఈ నల్లదనం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అసాధారణంగా ఉన్నాయని సూచిస్తుంది. కొన్నిసార్లు ఇది కాలేయ సంబంధిత వ్యాధుల లక్షణంగా కూడా కనిపిస్తుంది.

కళ్ళ చుట్టూ పసుపు మచ్చలు

మీ కనురెప్పలపై, కళ్ళ చుట్టూ చిన్న, పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి పెరుగుతున్నట్లయితే, అప్రమత్తంగా ఉండాలి. వీటిని జాంథెలాస్మా అంటారు. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలను విస్మరించడం వల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం అవసరం.

నోటి మూలల్లో పగుళ్లు లేదా కోతలు

పెదవుల మూలల్లో కోతలు లేదా పగుళ్లు ఏర్పడితే అది కేవలం పొడిబారడం మాత్రమే కాదు. ఇవి శరీరంలో విటమిన్ B12 లేదా ఐరన్ లోపానికి సంకేతం కావచ్చు.
ఈ పోషకాల లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.. కాబట్టి వీటిని వెంటనే సరిచేసుకోవాలి.

నెత్తిపై గుండ్రని బట్టతల మచ్చలు

మీ తలపై గుండ్రంగా నాణెం ఆకారంలో బట్టతల మచ్చలు కనిపిస్తే.. దానిని అలోపేసియా అరేటా అంటారు. ఇది కేవలం జుట్టు సమస్య మాత్రమే కాదు. ఇది తరచుగా తీవ్రమైన ఒత్తిడి, థైరాయిడ్ సమస్యలు లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులతో ముడిపడి ఉంటుంది. ఇటువంటి సమస్యలను విస్మరించకుండా, సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

వైద్యులు చెబుతున్నట్లుగా.. అనారోగ్యాలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా మీ చర్మం, కళ్లు, పెదవుల్లో వచ్చే అసాధారణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నియంత్రించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..