Milk: చిటికెలో పాల కల్తీని గుర్తించోచ్చు.. ఇంట్లోనే ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..
రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పాల్లో బోరిక్ యాసిడ్, యూరియా, డిటర్జెంట్ వంటి ప్రమాదకర రసాయనాలు కలిపి విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇంట్లోనే సులభమైన పరీక్షల ద్వారా కల్తీ పాలను గుర్తించి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి కొందరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. నిత్యం మన ఆహారంలో భాగమైన పాలు కల్తీకి గురవడం ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారింది. 100 లీటర్ల పాలను, రసాయనాలు కలిపి 250 లీటర్ల కల్తీ పాలుగా మార్చే ప్రబుద్ధుల దురాగతాలు వెలుగు చూశాయి.. ఈ నేపథ్యంలో, కల్తీ పాలను గుర్తించి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం అత్యవసరం. నిపుణుల ప్రకారం.. కల్తీ పాలను ఎలా గుర్తించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
పాలలో ప్రమాదకర రసాయనాలు..
పాలు చిక్కగా కనిపించడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కల్తీ చేసేవారు అనేక ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నారు. బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియం సల్ఫేట్, బెంజాయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్ లాంటివి కలుపుతున్నారని.. ఈ కల్తీ పాలను సేవించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పిల్లలు గ్యాస్ట్రో ఎంట్రైటిస్, కడుపునొప్పి, జ్వరం, టైఫాయిడ్, వాంతులు వంటి రోగాలతో బాధపడుతున్నారు. చాలామంది ఇవి తిన్న ఆహారం వల్లో, వాతావరణం వల్లో అని అనుకుంటారు కానీ, కల్తీ పాలే ప్రధాన కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటి వద్ద కల్తీ పాలను గుర్తించే సులభమైన పద్ధతులు:
ఫ్లాట్ ఉపరితలంపై పరీక్ష (నీటి పరీక్ష): ఒక గ్లాస్ ప్లేట్ లేదా ఫ్లాట్ బండపై రెండు చుక్కల పాలు వేయండి. అవి నెమ్మదిగా ఒక వైపు పారుతున్నప్పుడు వెనుక తెల్లటి గీతలాగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలు. కల్తీ పాలు అయితే నీరులా పారి, తెల్లటి గీత కనిపించదు.
pH స్ట్రిప్ పరీక్ష: మెడికల్ షాపుల్లో లభించే pH స్ట్రిప్‌ను కొనుగోలు చేయండి. స్ట్రిప్ పై ఒక చుక్క పాలు వేసి ఒక నిమిషం పాటు వేచి ఉండండి. pH విలువ 6.4 నుండి 6.6 మధ్య ఉంటే అవి స్వచ్ఛమైన పాలు. ఈ పరిధి కంటే తక్కువగా గాని, ఎక్కువగా గాని pH విలువ చూపిస్తే అవి కల్తీ పాలు అని అర్థం.
అయోడిన్ పరీక్ష (పిండి పదార్థాల కోసం): ఒక టెస్ట్ ట్యూబ్‌లో 5 ml పాలు తీసుకోండి. దానికి 2 ml అయోడిన్ ద్రావణాన్ని కలిపి బాగా కలపండి.
- పాలు లేత చాక్లెట్ రంగులోకి మారితే అవి కల్తీ పాలు.
- పాలు నీలం రంగులోకి మారితే అందులో గంజి లేదా ఇతర పిండి పదార్థాలు కలిపినట్లు.
- రంగులో ఎలాంటి మార్పు లేకపోతే పాలు స్వచ్ఛమైనవి.
డిటర్జెంట్ పరీక్ష: ఒక గ్లాసులో సగం పాలు, సగం నీరు పోసి బాగా కలపండి. డిటర్జెంట్ కలిపిన పాలు అయితే బాగా నురగ వస్తుంది. స్వచ్ఛమైన పాలు అయితే చిన్న చిన్న నురగ మాత్రమే వస్తుంది.
యూరియా పరీక్ష: మార్కెట్లో లభించే యూరియాసే స్ట్రిప్స్ (Urease Strips) ఉపయోగించి యూరియా కల్తీని గుర్తించవచ్చు. స్ట్రిప్ పై పాలు పోసినప్పుడు గీతలు కనిపిస్తే యూరియా కలిపినట్లు. గీతలు కనిపించకపోతే పాలు స్వచ్ఛమైనవి. కల్తీ చేసేవారు 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియా కలిపి చిక్కటి పాలలా మారుస్తున్న సంఘటనలు ఉన్నాయి.
మన ఆరోగ్యం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు. పాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నమ్మకమైన వ్యక్తుల వద్ద నుండే పాలు తీసుకోండి. పైన చెప్పిన పద్ధతులను ఉపయోగించి పాలు స్వచ్ఛమైనవో కాదో పరీక్షించుకుని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
