
కాచిన నూనెను మళ్లీ వాడే అలవాటు ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? పదే పదే వేడి చేసిన నూనెలో విషపదార్థాలు ఏర్పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలోకి చేరి ఏం చేస్తాయి? ఏ రోగాలకు దారి తీస్తాయి?
చాలా మంది ఇళ్లలో డీప్ ఫ్రై చేసిన నూనెను నిల్వ చేసుకుని మరుసటి రోజు కూడా వాడతారు. ఇది సాధారణ అలవాటుగా మారింది. కానీ, ఈ ప్రక్రియలో నూనెలో రసాయన మార్పులు జరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతకు గురైన నూనెలో ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్స్ వంటి హానికర సమ్మేళనాలు పెరుగుతాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి, కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది? మరి ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి?
నూనెను పదే పదే వేడి చేయడం వల్ల దానిలోని కొవ్వు ఆమ్లాలు విచ్ఛిన్నమై ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరంలోకి చేరి LDL కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను అసమతుల్యం చేస్తాయి. ధమనుల్లో ప్లాక్ పేరుకుపోవడం, వాపులు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం వంటివి జరుగుతాయి. కాలక్రమేణా ఇవి గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయి. పరిశోధనల ప్రకారం.. అధిక ఉష్ణోగ్రతలకు గురైన నూనెలో పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAH) వంటి కార్సినోజెన్స్ కూడా ఏర్పడతాయి.
వాడిన నూనెను నిల్వ చేసే విధానంలోనూ చాలా మంది తప్పులు చేస్తారు. మూత పెట్టకుండా, వెలుతురు పడే చోట ఉంచితే ఆక్సీకరణ వేగంగా జరిగి ఫ్రీ రాడికల్స్ మరింతగా పెరుగుతాయి. మళ్లీ వాడాలనుకుంటే తాజా నూనెతో కలిపి వాడవచ్చు కానీ, అందులోని విష సమ్మేళనాలు పూర్తిగా తొలగిపోవు. నూనెలోని విటమిన్ E, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు కూడా నాశనమవుతాయి. వాడిన నూనెను మళ్లీ వాడకపోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
పొద్దుతిరుగుడు నూనెకు బదులుగా పల్లి నూనె, ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్), కొబ్బరి నూనె, నెయ్యి వంటివి ఉపయోగించండి. ఇవి హై స్మోక్ పాయింట్ ఉండి, డీప్ ఫ్రైకు సురక్షితం. నెలకు ఒకసారి నూనె రకాన్ని మార్చడం వల్ల ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ సమతుల్యత కాపాడబడుతుంది. ఈ చిన్న మార్పులతో గుండె, కాలేయం, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ వంటశైలి మార్చుకుంటే.. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది!