Corona Third Wave: భారతదేశంలో కరోనా రెండో వేవ్ విచ్చలవిడిగా ప్రబలుతోంది. ఈ ఉధృతిని తట్టుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ నెలలో మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మూడో వేవ్ వస్తుందనే చెబుతోంది. ఈ అంశంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. చాలా మంది నిపుణులు ప్రపంచంలో కొన్ని దేశాలలో నాల్గవ వేవ్ సైతం వచ్చిందని చెబుతున్నారు. ఇక మూడో వేవ్ అంటూ వస్తే యువకులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్ ఎదుర్కోవడానికి పలు రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు, లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇదంతా ఎలా వున్నా. కచ్చితంగా కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని అందరూ నమ్ముతున్నారు. ఈ వేవ్ లను ఎదుర్కోవాలంటే అప్‌డేట్ వ్యాక్సిన్ లే శరణ్యం అంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూడో వేవ్ రావడం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనో వేవ్ లనుంచి బయట పడాలంటే మన జీవన విధానంలో మార్పులు తప్పనిసరిగా రావలసిందే అని విశ్లేషకులు అంటున్నారు.
వైరస్‌లలో తేడాలు..
కరోనా వైరస్ 2020 లో ఎక్కుగా ప్రాణాంతకంగా మారలేదు. కానీ, 2021లో కేసుల వేగం పెరిగింది. పిల్లలు,యువతపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. మరోవైపు మరణాల సంఖ్యా పెరిగిపోతోంది. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువ అయిపోతోంది. ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య ఈ విషయాన్నీ రుజువు చేస్తోంది. వైరస్ లలో మ్యుటేషన్ జరిగితే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకొని ప్రజలపై అది ఇంకా ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మ్యుటేషన్ చెందినది కావడం వల్ల కేసుల సంఖ్య.. మరణాల సంఖ్యా పెరిగిపోయింది.
వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కరోనా ప్రభావం ఎలా?
వాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువ ఉంటుంది. ఒక డోసు వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్టు తేలింది. అయితే, రెండు డోసులు వేసుకున్నాకే పూర్తి రక్షణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో మొదటి డోసు తీసుకున్నాక కూడా అక్కడక్కడ వైరస్ సోకుతోంది. వీరిలో నాన్ పల్మనరీ సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తోంది. అంటే ఇది ఊపిరితిత్తుల పై పెద్దగా ప్రభావం చూపించదు. కానీ, జ్వరం మాత్రం ఎక్కువగా ఉంటుంది. 102 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ వైరస్ సోకితే, దానిని డబ్ల్యూహెచ్‌వో రీ-ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారని చెబుతోంది. ఇలాంటి రోగుల్లో ఏ రకం వైరస్ వల్ల కొత్త ఇన్ఫెక్షన్ సోకిందో ప్రాధమిక నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
బ్రిటన్ నుంచి వచ్చిన వైరస్ పిల్లలు, యువతలో ఎక్కువగా వ్యాపిస్తోంది. బ్రిజిల్ వైరస్ అయితే, మరణించే ముప్పు ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. దక్షిణాఫ్రికా వైరస్ లక్షణాలు చాలా ఆలస్యంగా బయట పడుతున్నాయి. సాధారణంగా వైరస్ మ్యుటేట్ జరుగుతున్నప్పడు..వ్యాక్సీన్లను తట్టుకుని నిలబడగలిగే శక్తి..పరీక్షల్లో బయటపడని..ఔషధాలకు లొంగని శక్తి సంతరించుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో మూడో వేవ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం అని ఆ నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా అందరూ కరోనా నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే రక్షణ పొందగలుగుతామని వారు చెబుతున్నారు.