రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
నేటి వేగవంతమైన జీవన విధానంలో చాలా మందికి నిద్ర సమస్యగా మారింది. నిద్ర సరైన సమయంలో రాకపోతే ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. నిపుణులు చెబుతున్న కొన్ని సాధారణ టిప్స్ పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చు. స్క్రీన్ టైమ్ తగ్గించడం, ఒత్తిడిని నియంత్రించడం వంటి మార్గాలు నిద్ర మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ప్రస్తుతం అందరి జీవితాలు గందరగోళంగా ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా చాలా మందికి రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిపుణులు ఏం అంటున్నారో తెలుసా..? సరిగ్గా నిద్రపోతే జ్ఞాపకశక్తి, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. కొందరికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తే హాయిగా నిద్ర పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
టైమ్ టూ టైమ్
ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం శరీరానికి చాలా అవసరం. సెలవు రోజుల్లో కూడా దీన్ని పాటిస్తే జీవ గడియారం సరిగా పనిచేస్తుంది. దీనితో రాత్రి నిద్ర సులభంగా పడుతుంది.
పుస్తకాలు చదవడం
రాత్రిపూట పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కూడా శరీరానికి విశ్రాంతి కలిగించి మెదడుకు నిద్ర అవసరమని సంకేతం ఇస్తుందని అంటున్నారు.
ప్రశాంతత
మీరు పడుకునే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ వెలుతురు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి. మంచి పరుపు, దిండు వంటి వసతులు ఉండేలా చూడాలి.
స్క్రీన్ టైమ్
రాత్రిపూట ఫోన్, కంప్యూటర్ లాంటి పరికరాల వల్ల బ్లూ లైట్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. అందుకే నిద్రకు ముందు కనీసం 60-90 నిమిషాలు స్క్రీన్ టైమ్ తగ్గించాలి.
కాఫీ, సిగరెట్
మీరు సాయంత్రం కాఫీ, సిగరెట్, ఆల్కహాల్‌ను తీసుకోకుండా ఉండాలి. ఈ పదార్థాలు నిద్రకు విఘాతం కలిగిస్తాయి. అంతేకాకుండా మసాలా భోజనం లేదా అధిక ఆహారం తీసుకోవడం కూడా నిద్ర రాకపోవడానికి కారణమవుతాయి.
వ్యాయామం
ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. అయితే కఠినమైన వ్యాయామాలు నిద్రకు 2-3 గంటల ముందు చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన
నిద్రాభంగానికి ఒత్తిడి, ఆందోళన ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల నుంచి బయటపడటానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా మంచిదని సూచిస్తున్నారు.
పగటిపూట కునుకు
పగటిపూట 20-30 నిమిషాలు నిద్రపోవడం రాత్రిపూట హాయిగా నిద్రపోడానికి సహాయపడుతుంది. అయితే ఈ సమయం మించకూడదు లేదంటే రాత్రి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
ఎండలో తిరగడం
ఉదయాన్నే కాసేపు ఎండలో తిరగడం వల్ల జీవగడియారం సరిగా పని చేస్తుంది. దీంతోపాటు నిద్రకు ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ టిప్స్ పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.