Protein Diet: డైట్‌లో ఈ దేశీ పవర్ ఫుడ్స్ లేకపోతే.. మీ మజిల్ గెయిన్ జీరో అయినట్లే!
శరీరానికి బలం పెరగాలన్నా, కండపట్టాలన్నా (Muscle Gain) కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో, సరైన మోతాదులో ప్రోటీన్, ఫైబర్ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, సోయాచిక్కుడు గింజలు, మొలకలు వంటి సంప్రదాయ ఆహారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్ ను కలుగజేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. ఆ సమస్యలు లేకుండా వీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

శరీరానికి తక్షణ శక్తిని, దీర్ఘకాలిక పోషణను అందించడానికి ఉదయం తీసుకునే ఆహారం చాలా కీలకం. రాత్రి నానబెట్టిన వేరుశెనగను ఉదయం తినడం వలన ఎంతో బలం లభిస్తుంది. కండపట్టాలి అనుకునేవారు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తినాలి, మొలకలతో పాటు ఉదయం పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు. వీటితో పాటు కనీసం 12 గంటలు నానబెట్టిన జీడిపప్పు, బాదం పప్పు వంటి నట్స్ కూడా ఉదయం తినడం మంచిది.
మధ్యాహ్నం తీసుకోవాల్సిన ఆహారం
జీవక్రియ చురుకుగా ఉండే మధ్యాహ్నం సమయంలో కార్బోహైడ్రేట్స్ (శక్తి వనరులు) తీసుకోవడం మంచిది. పాలిష్ పట్టని ముడి బియ్యం అన్నం మధ్యాహ్నం తినాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండి, శరీరానికి శక్తిని నిదానంగా విడుదల చేస్తుంది.
సోయా గింజల ప్రాముఖ్యత
కండపట్టాలనుకునే వారికి సోయాచిక్కుడు గింజలు ఒక అద్భుతమైన వరం. అన్ని గింజలలో కంటే ఎక్కువ ప్రోటీన్స్ (35 నుండి 40 శాతం వరకు) కలిగిన గింజ సోయా. కండపట్టాలి అనుకునేవారు సోయాచిక్కుడు గింజలను 15 గంటలు నానబెట్టి అన్ని కూరలలో వేసుకోవచ్చు లేదా అన్నంలో కూడా వేయవచ్చు.
అయితే, సోయాచిక్కుడు వలన గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కావున, సోయాను రాత్రికి తినవద్దు. గ్యాస్ సమస్య ఉన్నవారు ఆ సమస్యను తగ్గించుకున్న తర్వాతే సోయా వాడటం మొదలుపెట్టాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మరింత మెరుగైన ఫలితాల కోసం, ఏదైనా చర్య తీసుకునే ముందు లేదా ఆహార నియమాలు మార్చుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.




