Vitamin D: విటమిన్-డి పుష్టిగా అందాలంటే ఏ సమయంలో ఎండలో ఉండాలి?
విటమిన్-డి విషయంలో సూర్యరశ్మికి మించినది మరొకటి లేదు. అందుకే డాక్టర్లు కూడా కనీసం రోజులో 20 నిమిషాల సేపు ఎండలో ఉండాలంటున్నారు. ఎండలోకి వెళ్లే అవకాశం లేనప్పుడు కనీసం.. వర్క్ ప్లేసులో అయినా సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్త పడాలి. వీలైతే కిటికీ పక్కనే సూర్యరశ్మికి వ్యతిరేక దిశలో కూర్చోవాలి. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలంటే డీ విటమిన్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తు పెట్టుకోండి.
విటమిన్-డి లోపం… ఇప్పుడు భారత్‌లో అతిపెద్ద సమస్యగా మారింది. సూర్యరశ్మి కింద పనిచేసే జనాలు, సూర్య నమస్కారాలు చేసే వ్యక్తులు ఉన్న మన సమాజాన్ని విటమిన్-డి లోపం వెంటాడుతుందని.. కనీసం ఆరోగ్య నిపుణులు కూడా అంచనా వేయలేదు. 3 సంవత్సరాల క్రితం నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో ఏకంగా 76 శాతం ప్రజలు డి విటమిన్ లోపంతో సఫర్ అవుతున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా మహిళల్లో ఈ లోపం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నారు. ప్రధానంగా పైసా ఖర్చు లేకుండా సూర్యరశ్మిలో విటమిన్-డి లభిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. తెల్లవారుజామునే వచ్చే లేలేత సూర్య కిరణాల నుంచి అత్యధిక డి విటమిన్ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలానే సాయంత్రం పొద్దుకూకే సమయంలో ఎండ కూడా మంచిదట. శరీరాన్ని బట్టి ఒక్కొక్కరి ఒక్కోలా సూర్యరశ్మి అవసరం ఉంటుంది. ఎండలో ఉన్నప్పుడు ప్రధానంగా మోచేతులు, ముఖానికి నేరుగా ఎండ తగిలేలా చూసుకోవడం మర్చిపోకూడదు.
తెలుపు, గోధుమ రంగులో బాడీ కలర్ కలిగి ఉన్నవారు రోజు కనీసం 20 నిమిషాలు నేరుగా శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అలా వారంలో కనీసం నాలుగుసార్లు ఎండలో ఉండటం ద్వారా బాడీ తగిన డి-విటమిన్ సమకూరుతుంది. నలుపు వర్ణంలో చర్మం ఉండే వారు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వారంలో 3 నుంచి 4 రోజులు సూర్యరశ్మి నేరుగా శరీరానికి తగిలేలా చూసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల ద్వారా శరీరానికి డి విటమిన్ తక్కువ మోతాదులో లభిస్తుంది. ఫిష్ లివర్ ఆయిల్స్, సాల్మన్, టూనా వంటి చేపల మాంసం, బీఫ్ లివర్, చీజ్, కొన్ని రకాల పుట్టగొడుగుల్లో కూడా కొంతమేరు డి విటమిన్ లభిస్తుంది.
నగరజీవనం పెరగడం, సరికొత్త లైఫ్‌స్టైల్, కాలుష్యం, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి సగటు భారతీయుడిని సూర్యరశ్మికి క్రమంగా దూరం చేస్తూ వస్తున్నాయి. మనిషికి శారీరకంగానూ, మానసికంగానూ డి విటమిన్ చాలా అవసరం. ఎముకల పటుత్వం, ఇమ్యూన్ సిస్టమ్, మెటబాలిక్ ఫంక్షన్స్, మెంటల్ హెల్త్.. వీటన్నింటిలోనూ విటమిన్ డి కీలక భూమిక పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉంటే.. యాంగ్జైటీ, డిప్రెషన్, మూడు స్వింగ్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే డాక్టర్లు, డైటీషియన్లను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం