బీర్ తాగితే నిజంగానే విటమిన్ బి6 అందుతుందా.? అసలు నిజం ఇదే..
మన శరీరంలోని మెదడు, రక్తం, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి6 ఎంతో అవసరం. ఇది మనం తినే మాంసం, చేపలు, ఓట్స్, బంగాళాదుంపల లాంటి ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందుతుంది. బి6 లోపం వల్ల వికారం, అలసట, మెదడు పనితీరు మందగించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మన శరీరానికి విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా విటమిన్ బి6 మెదడు పనితీరుకు, రక్త ప్రసరణకు, రోగ నిరోధక శక్తికి అత్యంత కీలకం. సాధారణంగా ఇది మాంసం, చేపలు, ఓట్స్, కూరగాయల ద్వారా లభిస్తుంది. అయితే, బీర్ తాగడం వల్ల కూడా విటమిన్ బి6 శరీరానికి అందుతుందా? అనే ప్రశ్నపై ఇటీవల ఒక ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. జర్మనీలోని సూపర్‌మార్కెట్లలో లభించే సుమారు 65 రకాల బీర్లపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో తేలిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పరిశోధనల ప్రకారం, ఒక గ్లాస్ బీర్ తాగితే రోజువారీ శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి6లో సుమారు 15 శాతం వరకు అందుతుందని తేలింది. ముఖ్యంగా ‘బాక్ బీర్’ రకంలో విటమిన్ బి6 స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని తర్వాత లాగర్ బీర్లు, గోధుమ బీర్లలో కూడా ఈ విటమిన్ ఆశించిన స్థాయిలో ఉంది. అయితే, బియ్యంతో తయారు చేసే బీర్లలో మాత్రం విటమిన్ బి6 చాలా తక్కువగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆల్కహాల్ లేని లాగర్ బీర్ ద్వారా దాదాపు 59 శాతం వరకు విటమిన్ బి6 అందుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
బీర్ తయారీలో వాడే బార్లీ, గోధుమలు, ఈస్ట్ వంటి ముడి పదార్థాల్లో సహజంగానే విటమిన్ బి6 ఉంటుంది. బ్రూయింగ్ ప్రక్రియలో ఈ విటమిన్ పూర్తిగా నశించకుండా బీర్‌లో నిలిచి ఉండటమే దీనికి కారణం. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, పురుషులకు రోజుకు 1.4 మిల్లీగ్రాములు, మహిళలకు 1.2 మిల్లీగ్రాముల విటమిన్ బి6 అవసరం. ఒక లీటర్ బీర్‌లో సుమారు 0.3 మిల్లీగ్రాముల నుండి 1 మిల్లీగ్రాము వరకు ఈ విటమిన్ ఉండే అవకాశం ఉంది. అయితే, విటమిన్ల కోసం బీర్ తాగడం అనేది సరైన పద్ధతి కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమతుల్య ఆహారం తీసుకుంటేనే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. కేవలం బీర్ లేదా ఇతర ఆల్కహాల్ పానీయాలను పోషకాల కోసం ప్రధాన వనరుగా చూడకూడదు. అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఈ చిన్న ప్రయోజనం కంటే చాలా ఎక్కువ. మద్యం అలవాటు ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో విటమిన్ బి6 లోపం వచ్చే అవకాశం ఉంది. వీగన్ ఆహారం తీసుకునేవారు పాలు, పెరుగు లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా బి-విటమిన్లను పొందవచ్చు. ఏదేమైనా, పరిమితంగా మద్యం సేవించడం లేదా ఆల్కహాల్ లేని పానీయాలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(ఈ ఆర్టికల్ కేవలం వ్యూయర్స్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, తాజా పరిశోధనల ప్రకారం ప్రచురించబడింది.. బీర్ తాగితే ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయని టీవీ9 తెలుగు ఏం ధృవీకరించలేదు)
