
రోజువారీ ఆహారంలో మనం ఎన్నో కూరగాయలు వాడుతాం. కానీ కొన్ని సార్లు వంకాయను తినం.. ఎందుకంటే దాని రుచి నచ్చదని అంటాం. కానీ మనం దీన్ని పూర్తిగా తినకపోవడం ఆరోగ్యానికి ఉపయోగపడే గొప్ప ఔషధాన్ని దూరం చేసుకున్నట్లే అవుతుంది. వంకాయలో ఫైటోన్యూట్రియంట్స్ అనే రసాయనాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి మెదడులోని నర కణాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. దాని వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మతిమరుపు తగ్గుతుంది.
ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల రోజూ తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల బలం తగ్గకుండా ఉండాలంటే వంకాయ మంచి సహాయం చేస్తుంది.
వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ శరీరంలోని కణాలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడి.. క్యాన్సర్ కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి.
వంకాయలో ఐరన్ ఉండటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచే అవకాశం ఉంటుంది. దీన్ని తరచుగా ఆహారంలో చేర్చడం ద్వారా రక్తహీనత (ఎనిమియా) సమస్యలను తగ్గించవచ్చు. నీరసంగా, అలసటతో ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.
డయాబెటిస్ ఉన్నవారు కూడా వంకాయ తినవచ్చు. ఇందులో ఉండే పాలిఫినాల్స్ రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది తోడ్పడుతుంది.
వంకాయలో ఎక్కువగా ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.
ఆయుర్వేద నిపుణుల మాటల ప్రకారం.. వంకాయ నిద్రలేమి లాంటి సమస్యలకు సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని అధిక వేడిని తగ్గించి, తల నొప్పి, మలబద్ధకం, గొంతులో గరగర, వాంతులు, శరీరంలో వాపులు, వాత రోగాలకు ఉపశమనం ఇస్తుంది. మొదటి దశలో ఉన్న కిడ్నీ రాళ్లను కరిగించే గుణం కూడా దీనిలో ఉంది.
ఈ కూరగాయను మీరు ఇష్టపడకపోయినా.. దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం విస్మరించలేనివి. రోజూ వంకాయను తక్కువ మోతాదులో ఆహారంలో చేర్చడం ద్వారా మన ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)