ChatGPT ఇచ్చిన సలహాతో ప్రాణం మీదకు తెచ్చుకుండు..! ఉప్పు బదులు బ్రోమైడ్ వాడిండు.. చివరికి ఏం జరిగిందంటే..?

AI సలహాలు.. ఒక్కోసారి డేంజర్ బెల్స్ మోగిస్తాయి. అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ChatGPT ఇచ్చిన సలహా విని ఒక వ్యక్తి ఉప్పు బదులు సోడియం బ్రోమైడ్‌ను వాడి సీరియస్ కండిషన్‌లో హాస్పిటల్‌లో చేరాడు. ఈ ఇన్సిడెంట్ చూస్తే AI ఇచ్చే సలహాలను కళ్లు మూసుకుని ఫాలో అయితే ఎంత ప్రమాదమో అర్థమవుతోంది.

ChatGPT ఇచ్చిన సలహాతో ప్రాణం మీదకు తెచ్చుకుండు..! ఉప్పు బదులు బ్రోమైడ్ వాడిండు.. చివరికి ఏం జరిగిందంటే..?
Chatgpt Diet Mistake Sends Man To Icu

Updated on: Aug 11, 2025 | 2:55 PM

ChatGPT ఇచ్చిన సలహాతో ఉప్పు బదులు సోడియం బ్రోమైడ్‌ (Sodium Bromide) వాడిన ఒక వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డాక్టర్లు దీన్ని ( AI ఇచ్చిన సలహాను నమ్మి బ్రోమిజం అనే విషపు వ్యాధి బారిన పడిన ఒక కేసు ) అని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ మొత్తం చదివితే AI సలహాలు ఫాలో అవ్వడం ఎంత డేంజరో అర్థమవుతుంది.

అసలేం జరిగిందంటే..?

ఆ వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. కానీ ఒకరోజు తన పక్కింటివాడు విషం పెడుతున్నాడనే అనుమానంతో ఆసుపత్రిలో చేరాడు. మొదట అతను తన ఆహారపు అలవాట్ల గురించి ఏమీ చెప్పకపోయినా.. వైద్యులు వివరంగా అడిగినప్పుడు అసలు నిజం బయటపడింది. అతను చాలా కఠినమైన వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నాడు. అంతేకాకుండా ఇంట్లోనే నీటిని శుద్ధి చేసి తాగుతూ.. గత మూడు నెలలుగా సాధారణ ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ వాడుతున్నాడు.

ChatGPT రోల్ ఏంటి..?

ఆ వ్యక్తి ChatGPTని ఉప్పు వాడకాన్ని ఎలా తగ్గించాలి..? అని అడిగాడు. దానికి ChatGPT సందర్భం ముఖ్యం అని చెప్పి ఉప్పులోని క్లోరైడ్‌కు బదులుగా బ్రోమైడ్‌ను వాడమని సూచించింది. అయితే బ్రోమైడ్ ఎంత ప్రమాదకరమైనదో.. దాని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఏమీ చెప్పలేదు. దాంతో ఆ వ్యక్తి ఆన్‌లైన్‌ లో బ్రోమైడ్‌ను కొనుగోలు చేసి దానిని వాడటం మొదలుపెట్టాడు.

బ్రోమిజం అంటే ఏంటి..?

బ్రోమిజం (Bromism) అంటే శరీరంలో బ్రోమైడ్ ఎక్కువగా చేరితే కలిగే విషపూరిత పరిస్థితి. ఇది మెదడు, మానసిక ఆరోగ్యం, చర్మానికి చాలా హానికరం. ఈ సమస్యతో భ్రమలు, అనుమానాలు, మొటిమలు, నడకలో ఇబ్బందులు వంటివి వస్తాయి. ఒకప్పుడు బ్రోమైడ్‌ను కొన్ని మందులలో వాడేవారు. అయితే దాని ప్రమాదాలను గుర్తించిన తర్వాత అమెరికాలో 1975 నుండి 1989 మధ్య తినదగిన ఉత్పత్తులలో దానిని నిషేధించారు. అయినప్పటికీ ఇప్పుడు బ్రోమైడ్ కలిగిన పదార్థాలు ఆన్‌లైన్‌లో సులభంగా దొరుకుతుండటంతో ఇలాంటి కేసులు మళ్లీ కనిపిస్తున్నాయి.

హాస్పిటల్‌లో ఏం జరిగిందంటే..?

హాస్పిటల్‌లో చేరిన తర్వాత ఆ వ్యక్తికి తీవ్రమైన అనుమానాలు, భ్రమలు కలిగాయి. అంతేకాకుండా నిద్రలేమి, అలసట వంటి సమస్యలతో పాటు ముఖంపై మొటిమలు, సరిగ్గా నడవలేకపోవడం, విపరీతమైన దాహం వంటి లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో అతని రక్తంలో బ్రోమైడ్ స్థాయి 1,700 mg/L గా తేలింది. ఇది సాధారణ స్థాయి (0.9–7.3 mg/L) కంటే చాలా ఎక్కువ. ఈ స్థాయి చూసి వైద్యులు అతనికి బ్రోమిజం (bromism) సోకిందని నిర్ధారించారు.

ట్రీట్‌మెంట్ ఎలా చేశారు..?

వెంటనే బ్రోమైడ్ వాడకం ఆపించి శరీరంలోని బ్రోమైడ్‌ను తొలగించడానికి వైద్యులు సెలైన్ ఇచ్చారు. మూడు వారాల్లో అతని మానసిక పరిస్థితి, ఆరోగ్యం మెరుగుపడింది. ఆ తర్వాత మందులు ఆపి డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్నాడు.

AI గురించి డాక్టర్ల సలహా

డాక్టర్లు కూడా ChatGPTని టెస్ట్ చేయగా అది మళ్లీ బ్రోమైడ్‌నే సూచించిందని చెప్పారు. ఇది AIలో ఉన్న పెద్ద లిమిటేషన్. AI టెక్నికల్‌గా సరైన సమాధానం ఇచ్చినా దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి చెప్పలేకపోతుంది. కాబట్టి వైద్యుల సలహా మాత్రమే కరెక్ట్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఏ కొత్త కెమికల్స్, సప్లిమెంట్లు లేదా డైట్‌లో మార్పులు చేయాలన్నా ముందుగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.