Health: స్లీపింగ్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.? ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్తా..

|

Jul 07, 2022 | 8:49 PM

Health: నిద్రలేమి వినడానికి ఇది చిన్న సమస్యే అయినా దీనితో బాధపడేవారికి మాత్రం ఇదొక నరకం. కంటి నిండా నిద్రలేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. శారీరకంగానే కాకుండా..

Health: స్లీపింగ్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.? ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్తా..
Follow us on

Health: నిద్రలేమి వినడానికి ఇది చిన్న సమస్యే అయినా దీనితో బాధపడేవారికి మాత్రం ఇదొక నరకం. కంటి నిండా నిద్రలేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. శారీరకంగానే కాకుండా మానసికంగానూ నిద్రలేమి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కొందరు సహజంగా నిద్ర ఎలా పోవాలో తెలియక స్లీపింగ్‌ ట్యాబ్లెట్స్‌ దారి పడుతున్నారు. అయితే దీనివల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్రవేత్తలు చేసిన పలు అధ్యయనాల్లోనూ ఇదే విషయం రుజువైంది.

లండన్‌, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించారు. రీసర్చ్‌లో భాగంగా సుమారు 60 లక్షల మందిని పరిగణలోకి తీసుకున్నారు. వీరి నిద్ర విధానం, ఆరోగ్యగానికి సంబంధించి మొత్తం డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏడు గంటలు నిద్రించిన వారిలో మెరుగైన జ్ఞాపకశక్తి, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. బాగా నిద్రపోయే వారిలో సమస్యలను పరిష్కరించే నైపుణం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటున్నట్లు తేలింది.

నోయిడాలోని ఫోర్టిస్‌ హాస్పిటల్‌కు చెందిన పల్మోనాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మృణాల్‌ సిర్కార్‌ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..’ఏ ఇద్దరు ఒకే రకమైన నిద్రను కలిగి ఉండరు. అయితే ప్రతీ ఒక్కరూ తమకంటూ ఓ నిర్ధిష్ట నిద్ర సమయాన్ని కలిగి ఉండాలి. ఒక రోజు ఒక సమయంలో పడుకొని, మరో రోజు మరో సమయంలో పడుకోకూడదు. నిద్రకంటూ ఒక నిర్ధిష్ట సమయాన్ని ఎంచుకోవాలి’ అని డాక్టర్ సూచించారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో నిద్రపోతే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

స్లీపింగ్ ట్యాబ్లెట్స్‌ ఎంత ప్రమాదకరమంటే..

కొంతమంది అసహజ విధానాల్లో నిద్రకు ప్రయత్నిస్తూ స్లీపింగ్‌ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. డాక్టర్ల సూచనమేరకు ట్యాబ్లెట్స్‌ తీసుకుంటే కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది కానీ కాలక్రమేణ అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. స్లీపింగ్‌ ట్యాబ్లెట్లపై ఎక్కువగా ఆధారపడితే దీర్ఘ కాలంలో డోస్‌ మరింత పెంచాల్సి వస్తుంది. అయితే ఆకస్మాత్తుగా ట్యాబ్లెట్లను ఆపేస్తే మూర్చ వ్యాధి (ఫిట్స్‌) వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని డాక్టర్‌ మృణాల్‌ సిర్కార్‌ తెలిపారు.

సహజ పద్ధతిలో నిద్ర పోవాలంటే ఏం చేయాలి.?

* బెడ్‌ రూమ్‌ కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అని గుర్తించండి. టీవీ చూడడం, ఆటలు ఆడడం లాంటివి చేయకూడదు.

* బెడ్‌పై ఎప్పుడూ పక్కన ల్యాప్‌టాప్‌ కానీ స్మార్ట్‌ ఫోన్‌కానీ పెట్టుకొని పడుకోకూడదు.

* ఒకవేళ పడుకోగానే నిద్రరాకపేతో లేచి గదిలో నుంచి బయటకు వచ్చి.. టీవీ చూడడం, ఏదైనా చదవాలి. నిద్ర వచ్చినప్పుడు మాత్రమే నిద్రకు ఉపక్రమించాలి.

* నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను దూరంగా ఉంచండి. వాటి నుంచి వచ్చే వెలుతురు నిద్రకు భంగం కలిగిస్తుందని గుర్తుంచుకోండి.

* పడుకునే ముందు కాఫీ లాంటి ఉత్ప్రేకరాలు తాగొద్దు. ఇవి నిద్రపై ప్రభావం చూపుతాయి.

* తినగానే ఎట్టి పరిస్థితుల్లో నిద్ర పోకూడదు. నిద్రకు ఉపక్రమించే కనీసం రెండు గంటల ముందే డిన్నర్‌ పూర్తి చేసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..