చలికాలంలో ఈ 3 టెస్టులు తప్పక చేయించుకోండి.. మీ ప్రాణాలు కాపాడే పరీక్షలు ఏంటంటే..?

చలికాలంలో గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లని వాతావరణం రక్తనాళాలను కుంచించుకుపోయి, గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. 45 ఏళ్లు పైబడినవారు, అధిక రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

చలికాలంలో ఈ 3 టెస్టులు తప్పక చేయించుకోండి.. మీ ప్రాణాలు కాపాడే పరీక్షలు ఏంటంటే..?
Winter Heart Health Tips

Updated on: Dec 24, 2025 | 9:54 PM

చలికాలం కేవలం వణుకును మాత్రమే కాదు, గుండెకు ముప్పును కూడా తెచ్చిపెడుతుంది. వేసవితో పోలిస్తే ఈ కాలంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు రక్త నాళాలు కుంచించుకుపోయి, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ముందస్తుగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరని ఢిల్లీ అపోలో హాస్పిటల్ కార్డియాలజీ నిపుణులు డాక్టర్ వరుణ్ బన్సాల్ సూచిస్తున్నారు.

చలికాలంలో గుండెపోటు ఎందుకు పెరుగుతుంది?

చల్లని వాతావరణం వల్ల శరీరంలోని రక్త నాళాలు సన్నబడతాయి. దీనివల్ల రక్త ప్రసరణ కోసం గుండె మునుపటి కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనికి తోడు ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ సమయంలోనే గుండెపోటు వచ్చే ప్రమాదం అత్యధికంగా ఉంటుందని డాక్టర్ బన్సాల్ వెల్లడించారు.

తప్పనిసరిగా చేయించుకోవాల్సిన 3 పరీక్షలు

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష: ఈ పరీక్ష ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరిగితే రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటుకు దారితీస్తాయి.

ఇవి కూడా చదవండి

బిపి పరీక్ష: చలికి రక్త నాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. బీపీ ఎక్కువగా ఉంటే గుండె కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవడం ముఖ్యం.

ఈసీజీ : గుండె కొట్టుకునే వేగం, గుండె కండరాల బలం, గుండెకు రక్త సరఫరా ఎలా ఉందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. తరచుగా ఛాతీ నొప్పి లేదా దడ వచ్చే వారు వెంటనే ECG చేయించుకోవాలి.

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?

కింది లక్షణాలు లేదా పరిస్థితులు ఉన్నవారు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి..

  • 45 ఏళ్లు పైబడిన వారు.
  • ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారు.
  • గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు.
  • అతిగా ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు.

ప్రారంభ దశలోనే ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంపై అవగాహన వస్తుంది. ఈ ప్రాథమిక పరీక్షల్లో ఏవైనా తేడాలు కనిపిస్తే, తదుపరి వైద్య పరీక్షల ద్వారా ప్రాణాపాయం కలగకుండా జాగ్రత్త పడవచ్చు. చలికాలం ఉదయాన్నే చలిలో వాకింగ్‌కు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..