మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం అంతా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు వారి శరీర నిర్మాణం దృష్ట్యా ఈ సమస్యకు గురవుతున్నారు. కొంత మంది బరువును తగ్గించేందుకు కొన్ని డైట్ ప్లాన్స్ అమలు చేసి పాటిస్తూ ఉంటారు. మరికొంత మంది ఎంత డైట్ చేసినా బరువు తగ్గట్లేదని బాధపడుతుంటారు. అయితే నిపుణులు మాత్రం ఎప్పుడూ చెప్పేది ఒక విషయమే.. ఊబకాయం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా శరీర బరువును నిర్వహించుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఇప్పుడో కొత్త విషయం పరిశోధనల ద్వారా వెల్లడైంది. ఊబకాయం ఉన్న వారు అన్నవాహిక, కడుపు, కాలేయం, ప్యాంక్రియాస్, కొలొరెక్టల్, పిత్తాశయం వంటి అవయవాల్లో వచ్చే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాలు, థైరాయిడ్ క్యాన్సర్లు వచ్చే అవకాశం 1.5 రెట్ల నుంచి 4 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఊబకాయంతో బాధపడే స్త్రీలు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 4 నుంచి 7 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ 1.5 రెట్లు, అండాశయ క్యాన్సర్ 1.1 రెట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పునరుత్పత్తి అవయువ క్యాన్సర్ కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం లేని వారితో పోలిస్తే ఊబకాయం ఉన్న వారు ఏకంగా 30 శాతం ఎక్కువ క్యాన్సర్ బారిన పడతారని నివేదికల్లో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల్లో దాదాపు 4 శాతం మంది కేవలం ఊబకాయం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ఐదు రెట్లు అధికంగా ఉంది. ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.7 కోట్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడతారని వెల్లడైంది.
ఊబకాయం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అనేక మార్గాలున్నాయి. మానవ శరీరంలోని కొవ్వు కణజాలం ఈస్ట్రోజన్ అధిక స్థాయిని విడుదల చేస్తుంది. ఇది మహిళల్లో రొమ్ము, ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఊబకాయం ఉన్న వారిలో అధిక స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కొలోక్టరాల్, కిడ్నీ, ప్రోస్టేట్ క్యాన్సర్ పెంచుతుంది. ఊబకాయం కణజాలంపై దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడికి గురి చేస్తుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..