
పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి వెలిగిపోతుంది. ఛావా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది ఛావా. ఈ దూకుడు చూస్తుంటే 400 కోట్లు ఈజీనే అనిపిస్తుంది.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ బయోపిక్ ఇది. మొఘల్ సామ్రాజ్యంపై ఆయన చేసిన దండయాత్రలతో పాటు.. ప్రజలపై ఆయన చూపించిన వాత్సల్యాన్ని ఈ సినిమాలో చాలా బాగా ఆవష్కరించారు దర్శకుడు లక్ష్మణ్. దాంతో కేవలం మహారాష్ట్రలోనే కాదు.. అన్ని సిటీస్‌లోనూ అదరగొడుతుంది ఛావా.

ఛావా కోసం ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ శిక్షణ వల్ల నా జీవితంలో క్రమశిక్షణ అలవాటైంది అని విక్కీ కౌశల్ చెప్పినప్పుడు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసినన్ని రోజులూ విక్కీ.. గాయాలను లెక్కపెట్టలేదు. లక్ష్యపెట్టలేదు. జస్ట్ మనసు పెట్టి మూవీ చేశారంతే!

ఛావా సినిమాలో శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ చేసిన సాహసాలను, ఆయన శౌర్యాన్నీ చెప్పారు మేకర్స్. నమ్మిన ధర్మాన్ని, తనవారిని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు.

గతేడాది స్త్రీ 2 తర్వాత మరే హిందీ సినిమాకు వందల కోట్ల వసూళ్లు రాలేదు. బాలీవుడ్ మళ్లీ గాడి తప్పుతుందా అనుకుంటున్న సమయంలో ఛావాకు వస్తున్న వసూళ్లు చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఊపు రాబోయే సినిమాలకు ఉపయోగపడితే అదృష్టమే. త్వరలోనే సికిందర్‌తో రాబోతున్నారు సల్మాన్ ఖాన్.