T.Krishna: టీ. కృష్ణలు వేర్వేరు అని తెలియక కలగాపులగం చేసి పారేశారు

 Warangal T.Krishna: వికీపిడియా సత్యపీఠమేమీ కాదు. అన్ని నిజాలు చెప్పడానికి! వికీపిడియాపై ఆధారపడటం అన్నివేళలా శ్రేయస్కరం కాదన్నది టి.కృష్ణ విషయంలో పదే పదే రుజువవుతున్నది. మన తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు టి.కృష్ణలు ఉండటంతో చాలా గందరగోళం సృష్టిస్తున్నారు. తెలుగు సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నవారికి అయోమయం కూడా కలిగిస్తున్నారు. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి అని చెబితూ నటుడు గోపీచంద్‌ నాన్న టి.కృష్ణ గురించి రాసేస్తున్నారు. పోనీ రాసిందంతా కరెక్టేనా అంటే అందులో సవాలక్ష తప్పులు. […]

T.Krishna: టీ. కృష్ణలు వేర్వేరు అని తెలియక కలగాపులగం చేసి పారేశారు
Khaidi Babai
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 08, 2022 | 1:29 PM

 Warangal T.Krishna: వికీపిడియా సత్యపీఠమేమీ కాదు. అన్ని నిజాలు చెప్పడానికి! వికీపిడియాపై ఆధారపడటం అన్నివేళలా శ్రేయస్కరం కాదన్నది టి.కృష్ణ విషయంలో పదే పదే రుజువవుతున్నది. మన తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు టి.కృష్ణలు ఉండటంతో చాలా గందరగోళం సృష్టిస్తున్నారు. తెలుగు సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నవారికి అయోమయం కూడా కలిగిస్తున్నారు. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి అని చెబితూ నటుడు గోపీచంద్‌ నాన్న టి.కృష్ణ గురించి రాసేస్తున్నారు. పోనీ రాసిందంతా కరెక్టేనా అంటే అందులో సవాలక్ష తప్పులు. నిజానికి ఇవాళ వరంగల్‌కు చెందిన దర్శక, ఎడిటర్‌ టి.కృష్ణ వర్ధంతి. ఈయన ఎడిటర్‌గా వ్యవహరించిన సినిమాలు, దర్శకత్వం వహించిన సినిమాలను ప్రకాశం జిల్లాకు చెందిన టి.కృష్ణ ఖాతాలో వేసేస్తున్నారు. గత అయిదారు సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది.

టి.కృష్ణ అసలు పేరు టి.కృష్ణమాచారి. 1927లొ వరంగల్‌ జిల్లా రాయపర్తిలో జన్మించారు. తండ్రిగారు మంచి పండితులు. తెలుగు భాషలోనే కాదు సంస్కృతంలోనూ దిట్ట. అప్పట్లో భగవద్గీతకు వ్యాఖ్యానం చెప్పడంలో ఆయనకు మించిన వారు లేరు. కృష్ణ దృష్టి సాహిత్యంపై కాకుండా సినిమాలపై పడింది. అందుకు కారణం మేనమామ హయగ్రీవాచారి. ఆయన వల్లే నాటకాలకు దగ్గరయ్యారు. నాటకాలు ఆడుతున్నా చదవుపై మాత్రం అశ్రద్ధ చూపలేదు. మెట్రిక్‌ అయ్యాక ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. అలా నాటకాలు వేస్తూ సినిమాలపై ఆసక్తిని అనురక్తిని పెంచుకున్నారు. పై చదువుల కోసం ఇంట్లోవారు చెప్పినా కృష్ణ దృష్టి మాత్రం సినిమాలపై ఉండటం వల్ల బీఏతోనే చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టేశారు.

ఓవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే గోల్కొండ పత్రికలో సినిమా సమీక్షలు గట్రాలు రాయడం మొదలు పెట్టారు. దాంతో పాటుగా హైదరాబాద్‌ ఆలిండియా రేడియోలో తెలంగాణ యాసలో గ్రామీణ వార్తలు చెప్పారు. ఇందుకోసం లింగడు అనే క్యారెక్టర్‌ను సృష్టించారు. తన అంతిమ లక్ష్యం సినిమానే కాబట్టి 1950లో మద్రాస్‌లో అడుగుపెట్టారు. ముందుగా భరణీ రామకృష్ణను కలుసుకున్నారు. ఆయన ఇచ్చిన సలహా మేరకు హెచ్‌ఎంరెడ్డిని కూడా కలుసుకున్నారు. కృష్ణ చెప్పిందంతా సావధానంగా విన్న హెచ్ఎం రెడ్డిగారు దర్శకత్వ శాఖలో అవకాశం కల్పించారు. కృష్ణకు నటుడవ్వాలన్న కోరిక బలంగా ఉన్నా తప్పదు కాబట్టి దర్శకత్వ శాఖలో చేరారు.

ఇవి కూడా చదవండి

అన్నట్టు కృష్ణ మద్రాస్‌ బండి ఎక్కడానికి ఇంకో కారణం కూడా ఉంది.. హైదరాబాద్‌ స్టేట్‌లో రజాకార్ల దౌర్జన్యాలు పెరగడంతో చదువుకు ఏడాది బ్రేక్‌ వచ్చింది. అప్పుడే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతున్న కాలంలోనే రామచంద్రరావుతో పరిచయడం ఏర్పడింది. ఈయనెవరంటే.. గూడవల్లి రామబ్రహ్మం దగ్గర ఇల్లాలు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన వ్యక్తి! జెమినీ స్టూడియోలో కూడా కొంత కాలం పని చేశారు. టి.కృష్ణలోని ప్రతిభను, ఉత్సాహాన్ని గమనించిన రామచంద్రరావు సినిమాల్లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ మాటలు కృష్ణ ఉత్సాహాన్ని ద్విగిణికృతం చేశాయి.

హెచ్‌ఎంరెడ్డి తీస్తున్న నిర్దోషి సినిమాతో టి.కృష్ణ సినిమా ప్రయాణం మొదలయ్యింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నా కృష్ణ చూపంతా నటనపైనే ఉండేది. గాయకుడవ్వాలన్న కోరిక కూడా బలంగా ఉండేది. అందుకు కారణం తాతగారి దగ్గర నేర్చుకున్న సంగీతం. ఇదే సమయంలో సి.ఆర్.సుబ్బరామన్ దగ్గర బృందగానంలో గొంతు కలిపే అవకాశం వచ్చింది. తర్వాత కె.ఎస్. ప్రకాశ్‌రావు దర్శకత్వంలో వచ్చిన మొదటిరాత్రి సినిమాలో చిన్న పాత్ర వేశారు. కృష్ణ మాట్లాడుతుంటే సహజసిద్ధమైన తెలంగాణ యాస వచ్చేది. అదే ఆయనకు ప్రతిబంధకం అయ్యింది. అప్పట్లో సినిమాల్లో మూడు జిల్లాల భాషదే ఆధిపత్యం. మంచి గాత్రం, నటనానుభవం, అభిరుచి, ఉన్నత విద్య ఉండి కూడా కృష్ణ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే తనకు ఇష్టమైన నటనారంగాన్ని వదిలిపెట్టేసుకుని దర్శకత్వ శాఖలో ఉండిపోయారు.

1952లో వరంగల్‌కు చెందిన కొందరు శుభోదయ పతాకంపై హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో ఆదర్శం అనే సినిమా తీశారు. దీనికి కృష్ణ సహకార దర్శకత్వం వహించడమే కాకుండా ఓ ముఖ్యమైన హాస్య పాత్రను కూడా వేశారు. అది కూడా సావిత్రిగారి పక్కన. ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించింది ఎం.వి.రాజన్‌. దర్శకుడికి ఎడిటింగ్‌ తెలిసుండాలని, ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటింగ్‌ నేర్చుకో అని రాజన్‌ ఇచ్చిన సలహా కృష్ణకు నచ్చేసింది. వెంటనే ఎడిటింగ్‌ శాఖలో చేరిపోయారు. రాజన్‌ దగ్గరే చాలా కాలం పని చేశారు. ఆ తర్వాత ఆలీబాబా నలభై దొంగలు, రాజకపూర్‌ ఆహ్‌ చిత్రానికి డబ్బింగ్‌ అయిన ప్రేమలేఖలు సినిమాలకు రాజన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు.

అన్నట్టు ప్రేమలేఖలు సినిమాలో ప్రాణ్‌కు తెలుగులో గాత్రధారణ చేసింది కృష్ణనే! ఇలా పొట్ట గడవడం కోసం అన్ని రకాల పనులు చేశారాయన. ఓసారి పాండిబజార్‌లో కృష్ణకు భావనారాయణ కనిపించారు. తాను, డీబీ నారాయణ కలిసి అమర సందేశం అనే ఓ సినిమా తీస్తున్నామని, అందులో సహాయకుడిగా చేరే ఇంట్రస్ట్ ఉందా అని అడిగారు. ఈ సినిమాకు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఆదుర్తితో అంతకు ముందే కృష్ణకు పరిచయం ఉంది. 1954లో అమరసందేశం వచ్చింది. రెండేళ్ల తర్వాత అన్నపూర్ణవారి తోడికోడళ్లు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఆదుర్తి సుబ్బారావుకు వచ్చింది. కృష్ణను ఎడిటింగ్‌ శాఖలో అసిస్టెంట్ ఎడిటర్‌గా తీసుకున్నారు ఆదుర్తి. అప్పట్నుంచి ఆదుర్తి చివరి చిత్రం వరకు ఎడిటింగ్‌ శాఖలో కృష్ణ పని చేశారు. ఆదుర్తి దర్శకత్వంలో 1961లో వచ్చిన కృష్ణప్రేమ సినిమాతో ఎడిటర్‌ అయ్యారు కృష్ణ. ఆ తర్వాత మంచి మనసులు, మూగమనసులు, తేనె మనసులు, కన్నెమనసులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్‌ చక్రవర్తి, సుమంగళి, దాగుడు మూతలు, తోడునీడ, వెలుగు నీడలు, పూలరంగడు, , సుడిగుండాలు., మరో ప్రపంచం ఇలా ఆదుర్తి అన్ని సినిమాలకు ఎడిటర్‌ కృష్ణనే.

తెలుగులోనే కాదు, హిందీలో మిలన్‌, డోలి, మస్తానా, మన్‌కా మీత్‌, దర్పణ్‌, జీత్‌ చిత్రాలకు కూడా ఎడిటర్‌గా పని చేశారు కృష్ణ. బిఆర్‌ చోప్రా సినిమాలకు కూడా కృష్ణ ఎడిటర్‌గా వ్యవహరించారు. అన్నపూర్ణ, బాబు మూవీస్, విజయభట్ తదితర సంస్థలకు పర్మినెంట్ ఎడిటర్‌గా ఉన్న టి.కృష్ణకు 1967లో దర్శకుడయ్యే అవకాశం వచ్చింది. విజయవర్ధన్‌ మూవీస్‌ వారు బొమ్మై అన్న తమిళ చిత్రం రైట్స్‌ తీసుకున్నారు. దాన్ని తెలుగులో ఆదుర్తి సుబ్బారావుతో తీయాలనుకున్నారు. ఆ సమయంలో ఆదుర్తి కాస్త బిజీగా ఉండటంతో టి.కృష్ణకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆ విధంగా ఉపాయంలో అపాయం అన్న సినిమాతో దర్శకుడయ్యారు కృష్ణ. ఆ సినిమాను 21 రోజుల్లోనే పూర్తి చేశారు కృష్ణ. సినిమా శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఎడిటర్‌గా కొనసాగారు. ఈ సమయంలోనే ఏక్‌ ముట్టి ఆస్మాన్‌ అనే ఉర్దూ నవలను చదివారు కృష్ణ. దాన్ని సినిమాగాతీయాలనుకున్నారు.

అయితే అప్పటికే అది దుష్మన్‌ పేరుతో హిందీలో తీయబోతున్నారని తెలుసుకుని కాస్త నిరాశ చెందారు. హిందీ సినిమా తెలుగు హక్కులు ఇస్తామని చెప్పడంతో కృష్ణ కొంత ఊరట చెందారు. వరంగల్‌కు చెందిన మార్కండేయ, ఆంజనేయులు, హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణ్‌రావు, బాబుల్‌నాథ్‌లు కృష్ణకు మంచి మిత్రులు. వీరు ఎప్పటి నుంచో కృష్ణతో మంచి సినిమా తీయాలనుకుంటున్నారు. దుష్మన్‌ సినిమా వారికి బాగా నచ్చడంతో బాలాజీ చిత్ర అనే పతాకంపై దుష్మన్‌ను తెలుగులో ఖైదీబాబాయ్‌గా తీశారు. ఇందులో శోభన్‌బాబు హీరో. 1974లో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్టయ్యింది. ఆ తర్వాత మంచిబాబాయ్‌, మొనగాడు, లక్ష్మీ నిలయం, అందరికంటే మొనగాడు, బలిపీఠంలో భారతనారి, అమ్మో పోలీసోళ్లు అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. 1980లో మద్రాసు నుంచి హైదరాబాదుకు వచ్చిన తర్వాత కూడా కృష్ణ మల్లె మొగ్గలు, విక్రం వంటి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా ఇలా అన్ని శాఖల్లోనూ రాణించిన టి.కృష్ణ 2001 మే 9న హైదరాబాదులో కన్ను మూశారు.

ఇది వరంగల్‌కు చెందిన టి.కృష్ణకు చెందిన సంక్షిప్త సమాచారం. ఈయన పని చేసిన సినిమాలను గోపీచంద్‌ నాన్నఅయన టి.కృష్ణ ఖాతాలో వేసి కలగాపులగం చేసేశారు..