ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్‌లు వచ్చాయి. క్రీడా, రాజకీయ, వ్యాపార వేత్తలకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత కథాంశంతో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. తాజాగా అలాంటి మరో బయోపిక్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అని చెప్పేందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అతను. ఒక్క చిన్న ట్రక్కుతో జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేడు 4300 వాహనాలకు అధిపతిగా ఎదిగారు. అతనే విజయ్ సంగేశ్వర. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన విజయ్ దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే ‘విజయానంద్’. రిషికా శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ పాత్రను నిహాల్ పోషించారు.
తండ్రి వారసత్వంగా వచ్చిన ప్రింటింగ్ ప్రెస్‌ను కాదనుకొని తానే స్వయంగా వ్యాపారంలోకి అడిగి పెట్టి విజయ్ పెద్ద వ్యాపార వేత్తగా ఎలా ఎదిగారన్న ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో ‘వీఆర్‌ఎల్’ లాజిస్టిక్స్ ఈ స్థాయికి ఎలా చేరిందన్న విషయాలను వివరించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు.
విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ ప్రేక్షకులకు తెగ ఆకట్టుకున్నాయి. ‘సాధించకుండా చస్తే చావుకే అవమానం. సిద్ధాంతాలు లేకుండా బతికితే, బతుక్కే అవమానం’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌లో వ్యాపార విస్తరణలో విజయ్ ఎదుర్కొన్న కష్టాలు, చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న విషయాలను ప్రస్తావించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..