సినిమా మీద నమ్మకం ఉంటే ఎన్ని రోజులైనా ఆగాలనిపిస్తుంది. థియేటర్ల నిండా సోల్జర్లు ఉన్నప్పుడే సినిమాను రిలీజ్ చేయాలనిపిస్తుంది. నలుగురితో నారాయణలాగా సినిమాను రిలీజ్ చేయడం ఎందుకు? కాసింత వెసులుబాటు చూసుకుని రిలీజ్ చేద్దామనే ఫీలింగ్ వస్తుంది. ఈ మాటలన్నీ రకరకాల సందర్భాల్లో గల్లీరౌడీ యూనిట్ నుంచి వినిపించినవే. మరి మేకర్స్ కాన్పిడెన్స్ ని గల్లీరౌడీ నిలబెట్టాడా? రిలీజ్‌కి ముందు చేసిన ప్రమోషన్ థియేటర్లకు ఆడియన్స్ ను రప్పిస్తుందా? మౌత్ టాక్ ఎలా ఉంది?
సినిమా: గల్లీరౌడీ
నటీనటులు: సందీప్ కిషన్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ మురళి, బాపినీడు, వెన్నెల కిషోర్, వైవా హర్ష, తదితరులు
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా
సమర్పణ: కోన వెంకట్
దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
సంగీతం: రామ్ మిర్యాల, సాయికార్తీక్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్
కథ: భాను
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
విడుదల: 17.09.2021
వైజాగ్‌లో మీసాల సింహాచలం (బాపినీడు) పెద్ద రౌడీ. ఆయన కొడుకు మీసాల అప్పన్న(ప్రకాష్‌రాజ్)ని యాక్సిడెంట్‌లో చంపేస్తాడు బైరాగి నాయుడు (మైమ్ గోపీ). అంతటితో ఆగకుండా సింహాచలాన్ని ఘోరంగా అవమానిస్తాడు. ఈ గొడవలకు దూరంగా పెరగాలనుకుంటాడు వాసు (సందీప్ కిషన్). సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదివి సెటిల్ కావాలనుకుంటాడు. అయితే వాసు చదువును మధ్యలోనే ఆపి సింహాచలాన్ని అవమానించినందుకుగానూ బైరాగి నాయుడు మీద పగ తీర్చుకోవాలని ఉసి గొలుపుతాడు నాయుడు (పోసాని). అందులో భాగంగానే అతనికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవతలివారి మీద చేయి చేసుకోని వాసు, ఉన్నట్టుండి తనకు నచ్చిన పట్టపగలు సాహిత్య (నేహా శెట్టి) కోసం పెన్ను బుజ్జిని కొడతాడు. ఆ ఘటనతో వాసు మీద రౌడీ షీటర్‌గా కేసు ఫైలవుతుంది. సాహిత్య కోసం రౌడీగా మారిన వాసు, ఆమె కుటుంబం కోసం ఓ కిడ్నాప్ చేయడానికి రెడీ అవుతాడు. కిడ్నాప్ అవ్వాల్సిన బైరాగి ఉన్నట్టుండి హత్యకు గురవుతాడు. దాంతో రంగంలోకి దిగుతాడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ రవి (బాబీ సింహా). రవికీ, బైరాగి కొడుకు నందాకి సంబంధం ఏంటి? బైరాగి కేసును రవి ఎందుకు ప్రెస్టీజియస్‌గా తీసుకుంటాడు. మధ్యలో కాన్‌స్టెబుల్ పట్టపగలు ఫ్యామిలీకి ఏం సంబంధం? వీళ్లందరి మధ్య పొరుగింటావిడ పోషించిన పాత్ర ఏంటి? వాసుకి డేవిడ్ చేసిన సాయం ఎలాంటిది? ఇలాంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
సందీప్ కిషన్‌కి యాక్టింగ్ కొత్త కాదు. వంశపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తి నచ్చక సాఫ్ట్ వేర్ కావాలనుకున్న వ్యక్తి, నచ్చిన అమ్మాయి కోసం మళ్లీ రౌడీగా మారడం, ఆ అమ్మాయికి తనంటే ఇష్టం లేదని తెలిసినా, ఆమె ఫ్యామిలీ కోసం నిలబడటం, ప్రతి మూమెంట్‌లోనూ నేచురల్‌గా నటించారు సందీప్. నేహా శెట్టి అండ్ ఫ్యామిలీ తమకు ఇచ్చిన కేరక్టర్లను పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. రాజేంద్రప్రసాద్ కేరక్టర్ బావుంది. జులాయిలో ఆయన చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రను అడుగడుగునా గుర్తు చేసింది. వెన్నెల కిశోర్, శివన్నారాయణ కామెడీ ఆడియన్స్ కి రిలీఫ్ ఇచ్చే విషయాలు. మేకింగ్ వేల్యూస్ బావున్నాయి. అందరికీ తెలిసిన కథే అయినా, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహకు అందుతూనే ఉన్నా, స్క్రీన్‌ప్లేలో మేజిక్ చేశారు కోన వెంకట్. తెలిసిన విషయాలనే సింపుల్‌గా, ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. రౌడీలుగా ముసలి బ్యాచ్‌ను పెట్టడం తో కామెడీకి స్కోప్ దొరికింది. రౌడీలకు డబ్బులిస్తున్నట్టు లేదు… అదేదో ఓల్డ్ ఏజ్ హోమ్‌ని రన్ చేస్తున్నట్టుంది, పప్పా వెర్రి పప్పా తరహా డైలాగులు, అస్తమానం పొరుగింటికొచ్చి అవీ ఇవీ అడిగే పొరుగింటామె కేరక్టర్, ఉల్లిపాయలు అమ్ముకునే వ్యక్తిగా షకలక శంకర్ కేరక్టర్ ఆడియన్స్ కి రిలీఫ్ ఇస్తాయి. ఇంటర్‌మిషన్‌ని ఎంటర్ టెన్షన్ అని రీప్లేస్ చేయడం కూడా బావుంది.
ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సరదాగా సాగే సబ్జెక్టు కాబట్టి పెద్దగా లాజిక్కులు వెతక్కుండా ఫ్లోతో చూసేయొచ్చు. పుట్టెనే ప్రేమ సాంగ్‌లో మాంటేజెస్ బావున్నాయి. స్పెషల్ సాంగ్ కూడా హుషారుగా ఉంది. అద్భుతమైన కథ, కథనాలను ఎక్స్ పెక్ట్ చేయకుండా డైరక్టర్ నాగేశ్వరరెడ్డి తరహా సరదాగా సినిమా చూడాలనుకుంటే, గల్లీరౌడీ మంచి ఆప్షన్.
– డా. చల్లా భాగ్యలక్ష్మి TV9 E T Desk
మరిన్ని ఇక్కడ చదవండి :