Lata Mangeshkar-Durrani: లతాతో పిచ్చి చేష్టలు చేసి తగిన ఫలితం అనుభవించిన గాయకుడు దుఱ్రాని

Lata Mangeshkar Passes Away: దుఱ్రాని మంచి గాయకుడే కానీ చాలా పొగరు. గర్వం. మితిమీరిన అహంకారం. వీటితో పాటు అమ్మాయిలంటే చులకనభావం. స్త్రీ లోలుడు కూడా! చాందినీరాత్‌ అనే సినిమాలో దుఱ్రానితో డ్యూయెట్‌ పాడాల్సిన అవసరం ఏర్పడింది లతా మంగేష్కర్‌కు...

Lata Mangeshkar-Durrani: లతాతో పిచ్చి చేష్టలు చేసి తగిన ఫలితం అనుభవించిన గాయకుడు దుఱ్రాని
Lata Mangeshkar Durrani

Edited By:

Updated on: Feb 06, 2022 | 12:53 PM

RIP Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ సినీ ప్రస్థానం చాలా సాఫీగా సాగిందనడానికి లేదు. మొదట్లో ఆమె ఎన్నో అవరోధాలను చవి చూశారు. ఎన్నో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఆరంభంలో లతాను ప్రొత్సహించినవారు చాలా మందే ఉన్నా, ఒకరిద్దరు నానా ఇబ్బందులు పెట్టారు. అందులో ప్రథముడు గాయకుడు జి.ఎమ్‌.దుర్రాని. అప్పట్లో ఆయన స్టార్‌ సింగర్‌. మహ్మద్‌ రఫీ(Mohammed Rafi)కూడా ఆయన పాటల్లో కోరస్‌ పాడిన సందర్భాలు ఉన్నాయి.. దుఱ్రాని మంచి గాయకుడే కానీ చాలా పొగరు. గర్వం. మితిమీరిన అహంకారం. వీటితో పాటు అమ్మాయిలంటే చులకనభావం. స్త్రీ లోలుడు కూడా! చాందినీరాత్‌(Chandni Raat) అనే సినిమాలో దుఱ్రానితో డ్యూయెట్‌ పాడాల్సిన అవసరం ఏర్పడింది లతా మంగేష్కర్‌కు. సినిమాకు నౌషాద్‌ సంగీత దర్శకుడు. హై ఛోరేకీ జాత్‌ బడీ బేవఫా అన్నది పాట తొలి పంక్తి. అప్పట్లో రికార్డింగుల్లో రెండే మైకులు ఉండేవి. ఒకటి ఆర్కెస్ట్రాకు. మరొకటి గాయనీగాయకులకు. దుఱ్రాని, లతాలు ఓకే మైకులో ఎదురెదురుగా పాడాల్సిన పరిస్థితి. మొదటి వాక్యం పాడగానే దుఱ్రాని పిచ్చి పిచ్చి చేష్టలు చేశాడు. అవి చాలా జుగుప్సగా ఉండటంతో లతకు కోపం వచ్చింది. ఎలాగో తమాయించుకుంది. మరో రికార్డింగ్‌ అప్పుడు లతా వేసుకున్న డ్రస్సు గురించి పిచ్చి కామెంట్‌ చేశాడు. మంచి కలర్‌ఫుల్‌ డ్రస్సులు వేసుకోకుండా ఇలా తెల్లటి దుప్పటి చుట్టుకొచ్చావేమిటి అని దుఱ్రాని ఏకవచనంలో అన్నాడు. లతాకు చిర్రెత్తుకొచ్చింది. సొంత కూతురులా చూసుకునే నౌషాద్‌ దగ్గరకు వెళ్లి బాధనంతా చెప్పుకుంది. దుఱ్రానితో పాడేది లేదని చెప్పేసింది.

అమ్మాయి .. నువ్వు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నావు. దుఱ్రానిలాంటి వాళ్లు అడుగుకు ఒకరు తగులుతారు నీకు. వీటిని మనం లెక్క చేయకూడదు. వాడిప్పుడు స్టార్‌ సింగర్‌. వాడితో పాడకపోవడం వల్ల నీకే నష్టం కాని, వాడికేం కాదు. నువ్వు గొప్ప స్టార్‌ సింగర్‌ అయ్యాక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫర్వాలేదు కానీ ఇప్పుడు వద్దు అని నౌషాద్‌ నచ్చ చెప్పారు. అయినప్పటికీ నౌషాద్‌ సలహా పాటించాలనుకోలేదు. మీరు ఎన్నైనా చెప్పండి గురువుగారు.. దుఱ్రానితో పాడటం నా వల్ల కాదు అని కరాఖండిగా చెప్పింది లతా. సరే నీ ఇష్టం అని ఊరుకున్నారు నౌషాద్‌. ఆత్మాభిమానం దెబ్బ తిన్న చోట ఉండకూడదన్నది లతా భావన. తర్వాతి కాలంలో లతాకు ఇతర పాటలు పాడే అవకాశాలు తామరతంపరగా వస్తున్న దుఱ్రానితో పాడే అవసరం మాత్రం రాలేదు. బహుశా తనకు బదులుగా మరో సింగర్‌తో పాడించమని దుఱ్రాని చెబుతూ ఉండవచ్చని లతా అనుకున్నారు. కాని జరిగింది వేరు. లతాతో పాడకపోవడం వల్ల దుఱ్రానికే నష్టం జరిగింది. లతాతో గొడవ పది మందికి తెలియడంతో సంగీత దర్శకులు ఇతర గాయకులకు అవకాశం ఇవ్వడం మొదలు పెట్టారు. క్రమంలో దుఱ్రానికి అవకాశాలు తగ్గిపోయాయి. మహ్మద్‌ రఫీ టాప్‌ సింగర్‌ అయిపోయారు.

గీత రచయిత నఖ్‌శబ్‌తో చెడుగుడు ఆడేసిన లతా మంగేష్కర్‌
మళ్లీ కనిపించావంటే ముక్కలు ముక్కలుగా నరికి శవాన్ని మురికి కాల్వలో వేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్

లతా మంగేష్కర్‌ను ఇబ్బంది పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు నఖ్‌శబ్‌.. మంచి గీత రచయిత. బుద్ది మాత్రం చెడు. అన్ని వ్యసనాలు ఉన్నాయి ఇతనికి. మహల్‌ సినిమాకు పాటలు రాసేటప్పుడు లతా మంగేష్కర్‌తో నఖ్‌శబ్‌కు పరిచయం ఏర్పడింది. రిహార్సల్స్‌ సమయంలో లతా దగ్గర ఉన్న పార్కర్‌ పెన్నును చూసి తెగ మెచ్చుకున్నాడు. లతా మంగేష్కర్‌కు ఓ అలవాటు ఉంది. తన దగ్గర ఉన్న వస్తువును ఎవరైనా మెచ్చుకుంటే ఏ మాత్రం ఆలోచించకుండా అది వారికి కానుకగా ఇచ్చేసేది. అలాగే ఆ పార్కర్‌ పెన్నును కూడా నఖ్‌శబ్‌కు కానుకగా ఇచ్చింది. ఆ పెన్నుపై లతా పేరు చెక్కి ఉండటాన్ని నఖ్‌శబ్‌ అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. పెన్నును అందరికీ చూపిస్తూ లత తనకు ప్రేమతో ఇచ్చిందని చెప్పుకోసాగాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా లతకు తెలిసినప్పటికీ గమ్మున ఊరుకుంది. దీంతో నఖ్‌శబ్‌ మరింత రెచ్చిపోయాడు. తను రాసిన ఓ పాట రిహార్సల్‌లో ఇంకాస్త శృంగారం ఒలికించాలని చెబుతూ వెకిలి చేష్టలు చేశాడు. అప్పుడూ లతా ఏమనలేదు. పాడ పాడేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ రోజు చెప్పాపెట్టకుండా లతా ఇంటికెళ్లాడు నఖ్‌శబ్‌. అతడిని చూడగానే కోపం నషాళానికి ఎక్కింది. అతడిని రోడ్డు మీదకు తీసుకొచ్చి చీరచెంగు నడుం చుట్టూ బిగించి ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించావంటే మర్యాద దక్కదు అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకు జడుసుకున్నాడు నఖ్‌శబ్‌. ఏమాటకామాటే చెప్పుకోవాలి. లతను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆమెకు ఓ అజరామరమైన పాటను ఇచ్చాడు. అదే మహల్‌లోని ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా అన్న పాట.

 

Follow Us