
గరిమెళ్ళ విశ్వేశ్వరరావు, తెలుగు సినిమా తెరపై తొలి బాల హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. 1959 ఆగస్టు 30న కాకినాడలో జన్మించిన ఆయన జీవితం, బాలతారగా అప్రతిహత విజయాలను, ఆ తర్వాత ఎదురైన సవాళ్లను తెలియజేస్తుంది. హరికథలు చెప్పే తండ్రి కృష్ణమూర్తి వారసత్వంగా మిమిక్రీ ప్రతిభను అందిపుచ్చుకున్న విశ్వేశ్వరరావు, చిన్నతనంలోనే తన నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. తుని సంస్థానాధీశుల నుంచి ఘన సన్మానం పొందిన ఆయన, విజయవాడలో నాగయ్య, ఎస్వీ రంగారావు వంటి మహానటుల ఆశీస్సులు అందుకున్నారు. వారి ప్రోత్సాహంతో మద్రాసులో ఇచ్చిన ప్రదర్శన పద్మనాభం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో “పొట్టి ప్లీడర్” చిత్రాన్ని నిర్మిస్తున్న పద్మనాభం, విశ్వేశ్వరరావు నటనకు ముగ్ధుడై, సినిమాలో లేని ఒక పాత్రను సృష్టించి ఆయనకు అవకాశం కల్పించారు. కేవలం ఆరేళ్ల వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టిన విశ్వేశ్వరరావు, తొలి పారితోషికంగా రూ. 350 పొందారు. “పొట్టి ప్లీడర్” విజయంతో ఆయనకు దాదాపు 30 చిత్రాల్లో అవకాశాలు లభించాయి. “భక్త పోతన”, “రక్త సింధూరం”, “శ్రీకృష్ణావతారం” వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి బాలతారగా విశేష ప్రజాదరణ పొందారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, చలం వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు విశ్వేశ్వరరావు.
“నిండు హృదయాలు” చిత్రంలో చలం చిన్నప్పటి పాత్రలో కోతిని భుజం మీద వేసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పాత్రలో ఆయన నటన అద్భుతం. ఈ సినిమా శతదినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ స్వయంగా విశ్వేశ్వరరావును మైక్ ముందుకు తోసి, “ఈ చిత్ర విజయానికి కారకులలో ఒకరైన వీడు మాట్లాడతాడు” అని పరిచయం చేశారు. అంత మంది పెద్దల ముందు ఏం మాట్లాడాలో తెలియక, ఘంటసాల పాడిన “నమో వెంకటేశా” పాట పాడి సభికులను అలరించారు. ఎన్టీఆర్ ఆయనను ఎంతగానో ప్రోత్సహించి, బాగా నటిస్తే “ఒరేయ్ నువ్వు పులివిరా” అని ప్రశంసించేవారు. ఎన్టీఆర్ నటించిన “శకుంతల” చిత్రంలో భరతుడిగా నటించిన బేబీ పద్మినికి విశ్వేశ్వరరావు డబ్బింగ్ చెప్పడం ఆయన ప్రతిభకు నిదర్శనం. మైక్ అందకపోయినా, ఎన్టీఆర్ బల్ల వేయించి పక్కనే కూర్చోబెట్టుకుని డబ్బింగ్ చెప్పించారు. అక్కినేని నాగేశ్వరరావు సైతం విశ్వేశ్వరరావు ప్రతిభను గుర్తించి, ఆయన పాడిన “ధారుణి రాజ్య సంపద” పద్యం విని “దుర్యోధనుడు” అని ముద్దుగా పిలిచేవారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి తారలుగా ప్రేక్షకాభిమానం పొంది, తర్వాత ముఖ్యమంత్రులైన వారితో కూడా నటించడం ఆయన సినీ ప్రస్థానంలోని మరో విశేషం. ముఖ్యంగా రోజా రమణితో ఆయన ఎక్కువ చిత్రాలలో నటించారు. శ్రీదేవి, ఆదినారాయణ, మాస్టర్ ప్రభాకర్ వంటి వారితో కూడా ఆయనకు తెర పంచుకున్నారు. నటనలో బిజీగా ఉన్నప్పటికీ, విశ్వేశ్వరరావు చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఎంఎస్సీ పూర్తి చేసి, ఉద్యోగ రీత్యా పదేళ్లపాటు సినీ రంగానికి దూరమయ్యారు. మళ్లీ మద్రాసు వచ్చిన తర్వాత, జయసుధ నిర్మించిన “వింత కోడళ్లు” చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా నటనపై దృష్టి సారించినా, దురదృష్టవశాత్తు పూర్వ వైభవాన్ని మాత్రం పొందలేకపోయారు. క్యాన్సర్‌తో ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన నటనను అభిమానించే వారందరినీ ఈ వార్త తీవ్రంగా కలచివేసింది.
Also Read: Allu Arjun: అలాంటి సినిమా నాకు లైఫ్‌లో పడుద్దా అనుకునేవాడిని.. ఆ కోరిక తీర్చింది అతనే