Rajinikanth: దటీజ్ రజినీకాంత్.. ఆ సినిమాకి పనిచేసిన వారికి కోటీ 30 లక్షలు రాత్రికి రాత్రే ఇచ్చేశాడు

|

Aug 30, 2023 | 3:30 PM

ప్రముఖ తమిళ నిర్మాత పిఎల్ తేనప్పన్ 1999లో రజనీకాంత్ నరసింహ సినిమా విడుదల సందర్భంగా జరిగిన హృదయపూర్వక సంఘటనను గుర్తుచేసుకుంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది, చాలా మంది సూపర్ స్టార్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి మనసుకు ఇది ఒక సాక్ష్యం అని చెబుతున్నారు. మంచి మనసు ఉన్న రజినీని నిండు నూరేళ్లు ఆ భగవంతుడు చల్లగా చూడాలని కామెంట్స్ పెడుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ....

Rajinikanth: దటీజ్ రజినీకాంత్.. ఆ సినిమాకి పనిచేసిన వారికి కోటీ 30 లక్షలు రాత్రికి రాత్రే ఇచ్చేశాడు
Rajinikanth
Follow us on

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన స్థానం, స్థాయి గురించి దేశంలోని జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 72 ఏళ్ల వయస్సులోనూ ఆయన రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నారు. ఇటీవల రిలీజైన జైలర్ సినిమా ఇండియాను షేక్ చేసింది. కాసుల వర్షం కురిపించింది. రజినీ అంటేనే స్టైల్, స్వాగ్‌ స్పెషల్‌గా గుర్తుకువస్తాయి. ఆయన నడకలో కూడా ఓ మ్యాజిక్ ఉంటుంది. చెప్పే ప్రతి డైలాగ్‌లోనూ తమ మార్క్ మేనరిజం కనిపిస్తుంది. అందుకే తమిళనాట జనాలు రజినీ అంటే పిచ్చెక్కిపోతారు. అయితే ఆయన మనసు కూడా ఎంత గొప్పదో తెలియజెప్పే ఘటనను ఇటీవల ఓ నిర్మాత పంచుకున్నారు. రజనీకాంత్ నటించిన మెగా-హిట్ ‘నరసింహ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన పిఎల్ తెన్నప్పన్ ఇటీవల ఒక తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.  1999లో వచ్చిన    సూపర్ స్టార్ ‘నరసింహ’  సినిమాలోని నటీనటులు, సిబ్బందికి రూ. 1.30 కోట్లు అదనంగా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఆ సినిమా అంచనా బడ్జెట్ రూ. 4 కోట్లు.. అయితే కేవలం రూ. 2.7 కోట్లతోనే మూవీ పూర్తయినట్లు వివరించారు.

1999లో జరిగిన ఈ మరిచిపోలేని సంఘటన గురించి తేనప్పన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నరసింహ షూటింగ్ పూర్తయిన నాలుగైదు రోజుల తర్వాత రజినీ సార్ నన్ను సంప్రదించారు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పూర్తి వివరాలతో పాటు వారికి చెల్లించిన రెమ్యూనరేషన్ వివరాలతో రాగలరా అని అడిగారు.నా వద్ద ఉన్న వివరాలన్నీ చెప్పాను.ఆ తర్వాత వెంటనే ఇంటికి వచ్చి కలవాలని కోరారు. నేను వెళ్లేసరికి చేతిలో ప్యాడ్‌తో టెర్రస్‌పై వేచి ఉన్నారు. టెక్నీషియన్లు, నటీనటులు అందరి పేర్లతో పాటు వారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా రాయమని అడిగారు. నేను అన్ని వివరాలు రాసి రజినికాంత్‌కు ఇచ్చాను” అని తేనప్పన్ వివరించారు.

మొత్తం సినిమా నిర్మాణ వ్యయం అంచనా వేసిన బడ్జెట్ కంటే చాలా తక్కువగా ఉందని అప్పుడు తానూ, రజినీ ఓ అంచనాకు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. “ఇప్పుడు  రూ.4 కోట్ల అంచనా వ్యయంలో రూ.1.30 కోట్లు మిగిలాయి. సినిమాలో భాగమైన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పడిన కష్టమే ఇందుకు కారణం. కాబట్టి దానిని వారి మధ్య పంపిణీ చేయాలి” అని రజనీకాంత్ సూచించినట్లు తేనప్పన్ చెప్పారు. ‘రజనీకాంత్ గోల్డెన్ హార్ట్’ చూసి తాను మైమరచిపోయానని, ఆ సమయంలో తన వద్ద డబ్బు ఉండటంతో  రమ్యకృష్ణ, మన్సూర్ అలీఖాన్ సహా ఇతర నటీనటులు, టెక్నీషియన్లలకు రాత్రికి రాత్రే మిగిలిన డబ్బు ఇచ్చినట్లు చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..