Varasudu: సీరియల్ కంటెంట్.. మిక్చర్ పొట్లం అన్నారు.. ఈ కలెక్షన్స్ ఏంది స్వామి

|

Jan 20, 2023 | 3:45 PM

దళపతి విజయ్.. తమిళనాట ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అతడంటే అభిమానులు పిచ్చెక్కిపోతారు. మన దగ్గర పవన్ కల్యాణ్ ఎలాగో.. అక్కడ ఆయన అలా అనమాట..

Varasudu: సీరియల్ కంటెంట్.. మిక్చర్ పొట్లం అన్నారు.. ఈ కలెక్షన్స్ ఏంది స్వామి
Vijay's Varasudu
Follow us on

విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నట్లు.. విజయ్ కూడా డబుల్ సెంచరీలు బాదేస్తున్నారు. అక్కడ కోహ్లీ గ్రౌండ్‌లో రెచ్చిపోతుంటే.. ఇక్కడ విజయ్ బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తున్నారు. ఇతర హీరోలు కుళ్లుకునేలా దళపతి దండయాత్ర సాగుతుంది. తాజాగా వరసగా ఏడోసారి 200 కోట్ల క్లబ్బులో చేరిపోయారు ఈ హీరో. వారిసుతో మరోసారి మ్యాజిక్ చేస్తున్నారు విజయ్. విజయ్ మరోసారి డబుల్ సెంచరీ కొట్టేసారు.. వారం రోజుల్లోనే 213 కోట్లు వసూలు చేసింది వారిసు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయింది. యావరేజ్ టాక్‌తోనే మొదలైనా.. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దక్కడంతో వీక్ డేస్ మొదలయ్యాక కూడా వారిసు దండయాత్ర సాగుతుంది. తెలుగులోనూ వారసుడుకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

వారిసు విజయ్ కెరీర్‌లో 7వ 200 కోట్ల సినిమా. గతేడాది విడుదలైన బీస్ట్ నెగిటివ్ టాక్‌తో మొదలై 240 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమా తెలుగులో ఫ్లాపైనా.. తమిళంతో పాటు మిగిలిన అన్నిచోట్ల సేఫ్ జోన్‌కు దగ్గర్లో ఆగింది. ఇక మాస్టర్ ప్యాండమిక్ సమయంలోనూ 200 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా లోకేష్ కనకరాజ్‌తో మరో సినిమా మొదలు పెట్టారు విజయ్. 2023 అక్టోబర్‌లో విడుదల కానుంది ఈ చిత్రం.

2019లో వచ్చిన బిగిల్ 250 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో విజిల్‌గా విడుదలై ఇక్కడా మంచి విజయం సాధించింది. దానికి ముందు మురుగదాస్ తెరకెక్కించిన సర్కార్ సినిమా కూడా 240 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది. ఇక మెర్సల్ గురించి పరిచయాలు అక్కర్లేదు. 2017లో ఈ సినిమాతోనే మొదటిసారి 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టారు విజయ్. అప్పట్నుంచి వరసగా 7 డబుల్స్ కొట్టారు దళపతి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.